Wolf attacks: ఉత్తర్ ప్రదేశ్‌ని తోడేళ్లు వణికిస్తున్నాయి. ముఖ్యంగా బహ్రైచ్ జిల్లాలో వరసగా దాడులకు తెగబడుతున్నాయి. నరమాంసానికి అలవాటు పడిన తోడేళ్లు పిల్లల్ని, వృద్ధుల్ని టార్గెట్ చేస్తూ చంపేసి, తింటున్నాయి. వీటిని పట్టుకునేందుకు 200 మందికి పైగా అటవీ, పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు. అయితే, ఇప్పటి వరకు 4 తోడేళ్లు బంధించారు. అయినా కూడా దాడులు ఆగడం లేదు. శుక్రవారం మహసీ తాహసీల్‌లో ఇంటి ముందు ఆడుకుంటున్న 8 ఏళ్ల బాలుడిపై తోడేలు దాడి చేసింది. బాలుడి కేకలు విని కుటుంబ సభ్యలు రక్షించడంతో ప్రాణాలు దక్కాయి. ప్రస్తుతం అతడిని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. గత రెండు నెలల్లో బహ్రైచ్‌లోని వివిధ గ్రామాల్లో తోడేళ్ల దాడుల వల్ల ఏడుగురు పిల్లలు, ఒక వ్యక్తి మరణించారు. 30కి పైగా మంది గాయపడ్డారు.
Read Also: Crime: బర్త్ డే పార్టీలో మత్తుమందు ఇచ్చి యువతిపై అత్యాచారం..
ఇదిలా ఉంటే, తోడేళ్ల దాడులపై ఉత్తర్ ప్రదేశ్ అటవీ శాఖ మంత్రి బేబీ రాణి మౌర్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదంగా మారాయి. ఓ పక్క తోడేళ్ల దాడులు కొనసాగుతుంటే, వాటిని వేగంగా నియంత్రించడం సులభం కాదని వింత వాదనని తెరపైకి తెచ్చారు. ఝాన్సీలో ఈ రోజు తోడేళ్ల దాడులపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘జంతువులు ప్రభుత్వం కన్నా చాలా తెలివైనవి కాబట్టి తోడేళ్లను సులభంగా పట్టుకోలేము’’ అని అన్నారు. చాలా టీములు తోడేళ్ల కోసం అణ్వేషిస్తున్నారని చెప్పారు. తోడేళ్లు ప్రభుత్వం కన్నా తెలివైనవి కాబట్టి సమయం పడుతుందని, మేము ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.
గురువారం కూడా తోడేళ్లు పిల్లలపై దాడులు చేశాయిన మహసీ తాహసీల్‌లోని గోల్వా గ్రామంలో పిల్లాడు ఆడుకుంటున్న సమయంలో తోడేలు దాడి చేసింది. పిల్లాడు కేకలు వేయడంతో తాము రక్షించినట్లు బాలుడి తల్లి చెప్పింది. చిన్నారిపై తోడేలు వెనుక నుంచి దాడి చేసిందని స్థానిక వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంజయ్ ఖత్రి తెలిపారు. వర్షాకాలంలో జూలై 17 నుండి దాడులు పెరిగాయి మరియు ఇప్పటి వరకు, ఈ దాడుల కారణంగా ఏడుగురు పిల్లలతో సహా మొత్తం ఎనిమిది మంది మరణించారు.