Allahabad HC: అలహాబాద్ హైకోర్టు వరస వివాదాల్లో ఇరుక్కుంటుంది. తాజాగా, అత్యాచార బాధితురాలి తీరును తప్పుబడుతూ ఇటీవల హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో పాటు నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఇది వివాదంగా మారింది. సోషల్ మీడియా వ్యాప్తంగా తీర్పును తప్పుపడుతున్నారు. ఢిల్లీలో పీజీ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం కేసులు, మహిళ స్వయంగా ఇబ్బందులను ఆహ్వానించిందని, ఆమె దీనికి బాధ్యత వహించాలని జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ అన్నారు.
మార్చి 11న వెలువడిన ఈ తీర్పుపై విస్తృతంగా విమర్శలు వస్తున్నాయి. మహిళా న్యాయవాదులు కొందరు ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. మహిళా న్యాయవాదుల సంస్థ ‘‘పితృస్వామ్య మనస్తత్వాన్ని’’ ఖండించింది. మణిపూర్ మాజీ చీఫ్ జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్ ఈ వ్యాఖ్యల్ని ‘‘ఆమోదయోగ్యం కాదు’’ అని అభివర్ణించారు. శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంకా చతుర్వేది.. ‘‘”అలహాబాద్ హైకోర్టుకు నిజంగా మంచి న్యాయమూర్తులు అవసరం. జస్టిస్ మిశ్రా (జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా) గతంలో ఇచ్చిన దయనీయమైన తీర్పుకు సంబంధించి ఎటువంటి చర్య తీసుకోలేదు, అయితే సుప్రీంకోర్టు దానిని నిలిపివేసింది, తాజా, మరో తీర్పు వచ్చింది’’ అని ట్వీట్ చేశారు.
గత నెలలో మైనర్ బాలిక వక్షోజాలను పట్టుకోవడం, ఆమె పైజామా దారాన్ని విప్పడం వంటి చర్యలు అత్యాచారం లేదా అత్యాచార ప్రయత్నం కిందకు రాదని జస్టిస్ మిశ్రా తీర్పు చెప్పడంపై భారీ వివాదమే నడిచింది. సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యల్ని ఆక్షేపించింది.
Read Also: Good Bad Ugly : గుడ్ బ్యాడ్ అగ్లీ డే-1 కలెక్షన్స్.. అజిత్ కెరీర్ లోనే ఎక్కువ..
కేసు వివరాలు:
ఈ కేసు సెప్టెంబర్ 2024 నాటిది, నోయిడాకు చెందిన ఒక యూనివర్సిటీ విద్యార్థిని ఢిల్లీలోని హౌజ్ ఖాన్‌లోని ఒక బార్‌కి తన ముగ్గురు మహిళా స్నేహితులతో వెళ్లింది. ఆ సమయంలో ఆమెకు నిందితుడితో సహా మరికొందరు పరిచయస్తులను కలిసింది. తెల్లవారు 3 గంటల వరకు మద్యంసేవించిన తర్వాత, నిందితుడు తన ఇంటికి ఆమెను తీసుకెళ్లాడు. ఆమె కూడా అందుకు అంగీకరించింది. అయితే, నిందితుడు ప్రయాణంతో తనను అనుచితంగా తాకాడని, అతడి ఇంటికి కాకుండా గుర్గావ్‌లోని అతడి బంధువుల ఇంటికి తీసుకెళ్లి, అక్కడ తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది.
మహిళ ఫిర్యాదు ఆధారంగా డిసెంబర్ 2024లో నిందితడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, నిందితుడు తన బెయిల్ పిటిషన్‌లో మహిళ తనకు సాయం అవసరం అని, విశ్రాంతి తీసుకోవడానికి తన ఇష్టపూర్వకంగానే తనతో వచ్చిందని వాదించాడు. అత్యాచారం చేయలేదని, ఈ సంఘటన పరస్పర అంగీకారంతో కూడిన లైంగిక సంబంధం అని అతను ఆరోపించాడు.
ఈ కేసులో ‘‘బాధితురాలి ఆరోపణ నిజమని అంగీకరించినప్పటికీ, ఆమె స్వయంగా ఇబ్బందులను ఆహ్వానించిందని, దానికి బాధ్యత వహించాలి’’ అని జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ అన్నారు. మహిళ పీజీ చదువుతుందని, కాబట్టి ఆమెకు ఆమె చేసే పనుల పట్ల పరిణితి ఉందని హైకోర్టు పేర్కొంది. నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది.