PIL At Supreme Court: హర్యానాలో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో ఢిల్లీలో అలర్ట్ అయ్యారు. హర్యానాలో మాదిరిగా ఢిల్లీలో అల్లర్లు జరగకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకొనేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. హర్యానాలో రెండు వర్గాల మధ్య చెలరేగిన అల్లర్ల సెగ దేశ రాజధాని ఢిల్లీని కూడా తాకింది. నుహ్ జిల్లాలో అల్లర్లకు నిరసనగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ), భజరంగ్ దళ్ ర్యాలీలు నిర్వహించతలపెట్టాయి. ఈ నేపథ్యంలో అల్లర్లు మరింత పెరిగే అవకాశం ఉందని సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఆయా సంఘాలు చేపట్ట తలపెట్టిన ర్యాలీలను రద్దు చేయాలని కోరుతూ పిటీషనర్ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టనున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.
Read also; Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అతిపెద్ద ఎయిర్ బస్ కార్గో విమానం
నుహ్, గుర్‌గ్రామ్‌లలో ఆందోళనలు తీవ్రస్థాయికి చేరాయి. అల్లర్లను ప్రేరేపించే చిన్న సంఘటన కూడా భారీ స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలిగించే అవకాశం లేకపోలేదు. కావున అల్లర్లను రెచ్చగొట్టే ఎలాంటి మతపరమైన ర్యాలీలకు అనుమతించవద్దని సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన పిటీషన్‌లో పేర్కొన్నారు. హర్యానా ఘటనకు నిరసనగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళనలకు పిలుపునిచ్చారు. దీంతో ఢిల్లీలోని నారిమన్ విహార్ మెట్రో స్టేషన్ పరిధిలో బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. మేవాత్ ప్రాంతంలో విశ్వహిందూ పరిషత్ నిరసనలకు పిలుపునిచ్చింది. మానేసర్‌లో భిసమ్ దాస్ మందిర్ వద్ద భజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ మహా పంచాయత్‌ను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో అల్లర్లు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ర్యాలీలకు అనుమతించవద్దని సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. హర్యానాలో సోమవారం అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. విశ్వహిందూ పరిషత్ ర్యాలీపై ఇతర వర్గం వారు దాడి చేయడంతో అల్లర్లు ప్రారంభమయ్యాయి. అల్లరిమూకలు వందల సంఖ్యలో వాహనాలకు నిప్పంటించారు. అల్లర్లను అదుపుచేయడానికి ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఇంటర్‌నెట్‌ను సైతం నిలిపివేసింది.