Ajit Pawar comments on Modi’s degree: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ డిగ్రీపై ప్రస్తుతం రాజకీయం నడుస్తోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మోదీ డిగ్రీలను బహిర్గత పరచాలంటూ దాఖలు చేసిన పిటిషన్ పై గుజరాత్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనకు జరిమానా కూడా విధించింది. చదువులేని ప్రధాని దేశానికి ప్రమాదం అంటూ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. మరోవైపు దేశంలోని ఇతర ప్రతిపక్ష నేతలు కూడా మోదీ డిగ్రీ చూపించాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు.
Read Also: Anand Mahindra : ధోని కోసం సీఎస్కే స్పెషల్ యూనిఫాం రెడీ చేయండి..
ఇదిలా ఉంటే మహరాష్ట్ర సీనియర్ ఎన్సీపీ నేత, మాజీ మంత్రి అజిత్ పవార్ మోదీ డిగ్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రుల డిగ్రీలపై ప్రశ్నించడం సరికాదని, ఆ మంత్రి ప్రజలకు ఏం చేశారన్నదే చూడాలని ఆయన అన్నారు. 2014లో మోదీ డిగ్రీ చూసి ప్రజలు ఆయనకు ఓటేశారా..? అని ప్రశ్నించారు. ఆయనకు ఉన్న ప్రజాకర్షణే ఆయన్ను గెలిపించిందని అన్నారు. ఈ సమయంలో డిగ్రీ గురించి ప్రశ్నించడం సరికాదని, ద్రవ్యోల్భణం, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయా..? అని ప్రశ్నించాలని అని సూచించారు.
మోదీ డిగ్రీకి సంబంధించి ఏడేళ్ల కేసులో కేంద్ర సమాచార కమిషన్ ఇచ్చిన ఆదేశాలను కొట్టేసింది గుజరాత్ హైకోర్టు. ఈ సమాచారాన్ని కోరిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు జరిమానా విధించింది. అయితే ఆయన ఈ తీర్పు అనంతరం మాట్లాడుతూ.. మోదీ విద్యార్హతపై మరింత అనుమానాలు పెరిగాయని, మోదీ నిజంగా విద్యావంతుడు అయితే పెద్ద నోట్ల రద్దు వంటి నిర్ణయాలు తీసుకుని ఉండేవారు కాదని కేజ్రీవాల్ విమర్శించారు. ఇదిలా ఉంటే కేజ్రీవాల్ విమర్శలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఆయన ప్రభుత్వం అవినీతిపై దర్యాప్తు సంస్థలు వెలుగులోకి తీసుకువస్తుంటే కేజ్రీవాల్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించింది.