Air India Plane Crash: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా 787-8 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే కుప్పకూలింది. విమానం 825 అడుగుల ఎత్తు నుంచి నేలను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం సమయంలో ప్రయాణికులు, విమాన సిబ్బంది కలిపి మొత్తం 242 మంది ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు.
Read Also: Air India Flight Crash Live Updates : కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం..
ఇదిలా ఉంటే, ప్రమాదం సమయంలో విమానంలో 80-90 టన్నుల ఇంధనం ఉందని తెలుస్తోంది. దీంతోనే, విమానం నేలను ఢీ కొట్టడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇది ప్రమాద తీవ్రతను పెంచింది. ప్రమాదం జరిగిన చోట పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. విమానం దాదాపుగా బూడిదైంది. పైలట్లు ప్రమాదానికి ముందు ఏటీసీకి అత్యవసరం సందేశం ‘‘మేడే’’ కాల్ చేశారు. దీని తర్వాత విమానం నుంచి ఎలాంటి స్పందన రాలేదని డీజీసీఏ వెల్లడించింది.
నిజానికి విమానం నుంచి ‘‘ఫ్యూయల్ డంప్’’ చేసే సమయం కూడా పైలట్లకు లేకుండా పోయింది. టేకాఫ్ సమయంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే, ముందుగా విమానం నుంచి ఇంధనాన్ని గాలిలోనే డంప్ చేస్తారు. కానీ, ఎయిర్ ఇండియా విమానానికి అంత సమయం లేదని వైరల్ అవుతున్న వీడియోలను చూస్తే తెలుస్తోంది. ఈ కారణాల వల్లే ప్రమాద సమయంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.