సైన్యంలో అగ్నిపథ్ స్కీమ్ ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పలువురు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. కేరళ, పంజాబ్, హర్యానా, పాట్నా, ఉత్తరాఖండ్ హైకోర్టుల్లో ఈ పథకానికి వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు అయ్యాయి. అయితే వీటన్నింటిపై మంగళవారం సుప్రీం కోర్టు విచారించింది. దేశవ్యాప్తంగా నమోదైన అగ్నిపథ్ స్కీమ్ కు వ్యతిరేకంగా నమోదైన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టకు బదిలీ చేయాలని జస్టిస్ డీవై చంద్రచూడ్, సూర్యకాంత్, ఎఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. నాలుగు హైకోర్టుల్లో పిటిషన్లు కూడా అగ్నిపథ్ స్కీమ్ పై ఢిల్లీ హైకోర్టులో తమ వాదనలు వినిపించుకోవచ్చని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. పెండింగ్ కేసులు బదిలీ చేయకపోయినా.. పిటిషనర్లు అభ్యంతరం తెలిపినా.. ఢిల్లీ హైకోర్టు నిర్ణయం తీసుకునే వరకు విచారణ ఆపాలని ఆయా కోర్టులకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.
Read Also: Cyber Fraud: ఢిల్లీ హైకోర్టు జడ్జి వాట్సాప్ డీపీతో ఘరానా మోసం
జూన్ 14న ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్ పై దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అగ్నిపథ్ స్కీమ్ కు వ్యతిరేకంగా బీహార్, సికింద్రాబాద్, హర్యానా ప్రాంతాల్లో నిరసనలు, ఆందోళనలు జరిగాయి. సైన్యంలో 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య వయసున్న వారిని అగ్నిపథ్ స్కీమ్ కింద నాలుగేళ్లు సైన్యంలోకి తీసుకోనున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. కాగా దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు జరగడంతో గరిష్ట వయోపరిమితిని 23 ఏళ్లకు పొడగించింది కేంద్ర ప్రభుత్వం. అగ్నిపథ్ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా 7.5 లక్షలకు పైగా దరకాస్తులు వచ్చినట్లు సైన్యం వెల్లడించింది.