ICMR: ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి ప్రభావం సమసి పోయిందని ప్రపంచ దేశాలు భావిస్తున్న తరుణంలో మరో కొత్త వేరియంట్లు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని దేశాలు నిర్ణయించుకున్నాయి. ఇటీవల రెండు కొత్త వేరియంట్లు ఎరిస్, బీ.ఏ.2.68 వెలుగు చూడడంతో అన్ని దేశాలను శాస్త్రవేత్తలు అప్రమత్తం చేశారు. ఈ వేరియంట్ల ఇన్‌ఫెక్టివిటీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. టీకాలు తీసుకున్న వారితో పాటు ఇంతకు ముందు కొవిడ్ సోకి కోలుకున్న వారిలోనూ రోగనిరోధక శక్తి ఉన్న వారిలో ప్రమాదం ఉండవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. కొత్త వేరియంట్లలోని ఉత్పరివర్తనాలు సులభంగా రోగ నిరోధకశక్తి నుంచి తప్పించుకుంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా కారణంగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయో తెలుసుకునేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఒక అధ్యయనం నిర్వహించింది. అందులో సింగిల్ డోస్ కొవిడ్ టీకా తీసుకున్న తరువాత కోవిడ్ మరణాలు తక్కువ అయ్యాయని ప్రాథమికంగా తేలినట్టు ఐసీఎంఆర్ చెబుతోంది. అయిఏ పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నట్టు ఐసీఎంఆర్ స్పష్టం చేసింది.
Read also: Megastar: చిరుతాతకి మనవరాలు క్లింకారా స్పెషల్ విషెష్… మిలియన్ డాలర్ ఫోటో
కొవిడ్ బారినపడ్డ 40 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు, కొమొర్బిడిటీ బాధితులు, తీవ్రమైన లక్షణాలు ఉన్న వ్యక్తుల్లో.. వైరస్ నుంచి కోలుకున్న సంవత్సరంలోపు మరణాల రేటు ఎక్కువ ఉంది. కరోనా మహమ్మరి శరీరంలో సమస్యలను అభివృద్ధి చేస్తుందని అధ్యయనంలో గుర్తించారు. తీవ్రమైన సమస్యలతో ప్రమాదం పెరగడంతో పాటు మరణాన్ని సైతం పెంచుతుందని ఐసీఎంఆర్ తెలిపింది. కరోనాకు ముందు వ్యాక్సిన్ సింగిల్ డోసు తీసుకున్న వ్యక్తుల్లో.. డిశ్చార్జి తర్వాత మరణాల ప్రమాదం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. కరోనా అనేక రకాల ఆరోగ్య సమస్యలను పెంచుతుందని అధ్యయనంలో గుర్తించారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పాటు మరణ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని పేర్కొంది. పోస్ట్-డిశ్చార్జ్ మరణాల నుంచి 60శాతం రక్షణ లభిస్తుందని ఐసీఎంఆర్ తెలిపింది. అధ్యయనంలో భాగంగా కరోనాతో ఆసుపత్రిలో చేరి డిశ్చార్జ్ అయిన 14,419 మందిని ఏడాది పాటు పరిశీలించింది. నాలుగువారాలకోసారి వారి ఆర్యోగ్యంపై ఆరా తీశారు. ఏడాది తర్వాత పూర్తి వివరాలతో ఐసీఎంఆర్ నివేదికను రూపొందించింది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత వారిలో 942 మంది మృతి చెందగా.. 13,477 మంది ఆరోగ్యంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు సేకరించిన సమాచారాన్ని విశ్లేషించిన ఐసీఎంఆర్ తద్వారా నివేదికను రూపొందించింది. ఆస్పత్రిలో చికిత్స పొందిన కొవిడ్-19 రోగుల వివరాలను ఐసీఎంఆర్ పరిధిలోని నేషనల్ క్లినికల్ రిజిస్ట్రీ సేకరించింది. దేశవ్యాప్తంగా 31 కేంద్రాలు ఉండగా.. అవి సేకరించిన డేటా ఆధారంగానే ఈ అధ్యయనం కొనసాగింది. ఇంకా అధ్యయనం కొనసాగుతోందని.. అధ్యయనం పూర్తి అయిన తరువాత పూర్తి వివరాలను ప్రకటించనున్నట్టు ఐసీఎంఆర్ స్పష్టం చేసింది.