Uniform Civil Code: ఉమ్మడి పౌరస్మృతి(యూనిఫాం సివిల్ కోడ్, యూసీసీ)పై ప్రధాని నరేంద్రమోడీ భోపాల్ లో చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలను సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ తో పాటు పలు ప్రతిపక్షాలు యూసీసీని వ్యతిరేకిస్తు్న్నాయి. అసదుద్దీన్ ఓవైసీ వంటి నేతలు భారత వైవిధ్యాన్ని, భిన్నత్వాన్ని దొంగిలించాలని చూస్తున్నారని.. ప్రధానికి దమ్ముంటే ముందుగా యూసీసీని పంజాబ్ లో ప్రజలకు చెప్పండి అంటూ సవాల్ విసిరారు.
ఇదిలా ఉంటే ప్రధాని వ్యాఖ్యలతో ముస్లిం అత్యున్నత సంస్థ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డ్(AIMPLB) మంగళవారం అర్ధరాత్రి అత్యున్నత సమావేశానికి పిలుపునిచ్చింది. యుసిసిని వ్యతిరేకించాలని సమావేశంలో సభ్యులు నిర్ణయించారు, దాని చట్టపరమైన అంశాలను చర్చించారు. యూసీసీపై లా కమిషన్ ముందు ముస్లిం లా బోర్డు తమ పక్షాన్ని వాదించాలని, పత్రాలను కూడా సమర్పించాలని బోర్డు సభ్యులు నిర్ణయించారు.
Read Also: IT hirings: ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 6 వేల మందిని తీసుకోనున్న భారత టెక్ కంపెనీ..
ప్రధాని వ్యాఖ్యల తర్వాత కాంగ్రెస్ తో పాటు డీఎంకే, ఎంఐఎం సహా పలు పార్టీలు ప్రధాని వ్యాఖ్యల్ని ఖండించాయి. డీఎంకే ముందుగా హిందువులకు యూసీసీని వర్తింపచేయాలని డిమాండ్ చేసింది. ద్రవ్యోల్భణం, మణిపూర్ సమస్యలు, నిరుద్యోగం వంటి అంశాలపై ప్రజల దృష్టి మరల్చేందుకే ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాంటూ కాంగ్రెస్ మండిపడింది.
అంతకుముందు మంగళవారం భోపాల్ లో బీజేపీ కార్యకర్తలతో సమావేశమైన ప్రధాని మోడీ యూసీసీపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం రెండు చట్టాలపై నడవదని అన్నారు. ట్రిపుల్ తలాక్ ముస్లిం దేశాల్లో అమలు చేయడం లేదని గుర్తు చేశారు. ట్రిపుల్ తలాక్ ముస్లిం మహిళలకే కాదు ఆ కుటుంబాలకు కూడా హాని కలిగిస్తోందని ఆయన అన్నారు. మన రాజ్యాంగం ప్రజలందరికి సమాన హక్కులను ఇస్తోందని, సుప్రీంకోర్టు కూడా యూసీసీపై కీలక వ్యాక్యలు చేసిందని ఆయన అన్నారు.