Afghanistan: భారతదేశంలో ఆఫ్ఘానిస్తాన్ తన రాయబార కార్యాలయాన్ని మూసేసింది. గత కొన్ని నెలలుగా భారత్‌లో ఆఫ్ఘాన్ రాయబారి లేరు. ఢిల్లీలోని ఆఫ్ఘాన్ దౌత్యవేత్తలు కూడా యూకే, అమెరికా వెళ్లి ఆశ్రయం పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే భారత్ లో ఆఫ్ఘాన్ రాయబార కార్యాలయం అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ముగ్గురు రాయబార కార్యాలయ అధికారులు శుక్రవారం తెలిపారు.
భారతదేశం తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించలేదు. 2021లో తాలిబాన్లు ఆఫ్ఘాన్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత భారత్, కాబూల్ లోని దౌత్యకార్యాలయాన్ని మూసేసింది. అయితే భారత్ అంతకుముందు ఆఫ్ఘాన్ ప్రెసిడెంట్ గా ఉన్న అష్రఫ్ ఘనీ నియమించిన రాయబారి సిబ్బందికి వీసాలు జారీ చేయడానికి, వ్యాపార వ్యవహారాలు చూసేందుకు అనుమతించింది. ప్రస్తుతం ఐదుగురు ఆఫ్ఘన్ దౌత్యవేత్తలు భారత్ విడిచిపెట్టినట్లు ఎంబసీ అధికారులు తెలిపారు. భారత ప్రభుత్వం ఇప్పుడు కేర్ టేకర్ హోదాలో రాయబార కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోనుంది. అయితే ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ పరిశీలిస్తోంది. కాబూల్ లోని తాలిబాన్ అధికారులు కూడా దీనిపై స్పందించలేదు.
Read Also: Women Reservation Bill: చట్టంగా మారిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. రాష్ట్రపతి ఆమోదం..
తాలిబాన్ అధికారం చేపట్టకముందు అప్పటి అష్రఫ్ ఘనీ సర్కార్ ఆఫ్ఘాన్ ఎంబసీ హెడ్ గా అంబాసిడర్ గా ఫరీద్ మమున్‌జేని నియమించింది. 2021 ఆగస్టులో తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత ఆయనే రాయబారిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఇతను లండన్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఏప్రిల్- మే నెలల్లో తాలిబాన్లు ఫరీద్ స్థానంలో ఖాదిర్ షాను నియమించింది. అప్పటి నుంచి ఎంబసీలో అధికారం కోసం కమ్ములాట మొదలైంది.
ఆఫ్ఘనిస్తాన్ లో మానవతా సాయం, వైద్య సహాయం, వాణిజ్యం సులభతరం చేయడానికి కాబూల్‌లో మిషన్ నడుపుతున్న కొన్ని దేశాల్లో భారత్ ఒకటి. 2019-20లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 1.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత ఇది బాగా పడిపోయింది. భారత్ లో విద్యనభ్యసిస్తున్న వందలాది ఆఫ్ఘాన్ విద్యార్థులు వీసా గడువు ముగిసిపోయిన ఇంకా ఇక్కడే ఉన్నారు. వారు తమను భారత్ లోనే ఉండనివ్వాలని కోరుతూ ఈ నెల ప్రారంభంలో న్యూఢిల్లీలో ప్రదర్శన నిర్వహించారు.