Acharya Devobhava Sarvepalli Radhakrishnan: మాతృదేవోభవ… పితృదేవోభవ …ఆచార్యదేవోభవ..తల్లి, తండ్రి తరువాత స్థానం గురువుదే అన్నారు పెద్దలు. గురువు అనే పదానికి ప్రత్యేకమైన అర్ధముంది. గురు అంటే చీకటిని తొలగించు అని అర్ధం. విద్యార్థి అజ్ఞానమనే చీకటిని తొలగిస్తాడు కాబట్టి గురువు అనే పేరు స్థిరపడిపోయింది. గురు అంటే దానిని రుచ్యము చేసేది, అంటే ఆ రహస్యమైన దానిని తెలియపరిచేది అన్నమాట.
మన దేశంలో పాఠశాల లేని పల్లెటూరైనా ఉండవచ్చేమోగానీ.. ఉపాధ్యాయుడు లేని ఊరు మాత్రం ఉండదు. బ్రతుకుతెరువుకోసం పాఠాలు చెప్పుకునే ప్రతి వ్యక్తీ, బ్రతుకు మార్గాన్ని పాఠశాల నుండి చూపించే ఉద్యోగస్తుడూ ఉపాధ్యాయుడే. ఆయన ఎక్కడివాడైనా స్థానం అత్యుత్తమమైనది, అనిర్వచనీయమైనది. పాఠశాలలో చెప్పే ప్రతి పాఠంలో ఒక సూక్తి వుంటుంది, జీవితం దాగి వుంటుంది అందుకే పాఠాలతోపాటు ఆయన బోధించే సారాంశం.. పాఠాలతో ప్రత్యక్ష సంబంధం లేనిదైనా అది విద్యార్ధి భవిష్యత్తు మీద పరోక్ష సంబంధాన్ని ప్రగాఢంగా చూపుతుంది కాబట్టి ఉపాధ్యాయుడి వాక్కుకు అంత శక్తి ఉంది.
ఒక లాయర్.. ఒక డాక్టర్..ఒక నర్సు… ఒక పైలట్.. ఇలా ఎన్నో వృత్తులు వున్నా.. టీచర్ లేకుంటే.. వీళ్ళెవరూ లేరు. ఉపాధ్యాయుడికి వున్న శక్తి అనంతమైనదనే చెప్పాలి. స్టూడెంట్ చివరి దశ వరకు అతని వెన్నంటే ఉంటుంది, విద్యార్థి దేహం వంటివాడైతే ఉపాధ్యాయుడు ఆత్మ వంటివాడు. ఉపాధ్యాయుడిని ప్రతి యేటా సత్కరించుకోవాల్సిన బాధ్యత విద్యార్ధుల మీదే కాదు.. సమాజం మీద కూడ ఉంది.
కావున ప్రతి ఏడాది సెప్టెంబర్ 5వ తేదీన జాతీయ స్థాయిలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. టీచర్స్ డేగా విదేశాల్లో కూడా అతి ఘనంగా ఈ వేడుకలను జరుపుకుంటారు. మన దేశానికొస్తే సెప్టెంబర్ 5నే ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకోవడానికి కారణం ఆ రోజు భారత ద్వితీయ రాష్ట్రపతిగా అద్వితీయంగా తన పదవీ బాధ్యతలను నిర్వహించిన డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ (1888-1975) జన్మదినం కావడమే. అయితే.. 1962 నుండి 1967 వరకు దేశాధ్యక్షుడిగా పని చేసిన రాధాకృష్ణన్ ప్రారంభంలో ఉపాధ్యాయుడు. ఆయన స్వయంగా ఉపాధ్యాయుడైన విద్య మీద అపార నమ్మకంగలవాడు.
ఇక విద్యాధికులు మాత్రమే దేశ సౌభాగ్యానికి చుక్కానులని ఆయన విశ్వసించేవారు. నిజానికి ఉపాధ్యాయ దినోత్సవాన్ని సెప్టెంబర్ 5న జరపవలసిందిగా కోరిందీ ఆయనే. ఇక తన పుట్టిన రోజునాడు తనని అభినందించడానికి వచ్చిన తన అభిమానులను ఆయన ఈ రోజు నన్ను అభినందించడంకంటే ఉపాధ్యాయులను అభినందించడం నాకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందనడంతో ఆ రోజు నుంచి ఉపాధ్యాయ దినోత్సవాన్ని రాధాకృష్ణన్ పుట్టిన రోజునాడు నిర్వహించడం జరుగుతున్నది. అలాగే.. మాజీ రాష్ట్రపతి కలాం కూడా గతంలో ఉపాధ్యాయుడే. ఆయన పదవీ విరమణ అనంతరం మరలా ఉపాధ్యాయ వృత్తిని చేపడుతుండడం ఉపాధ్యాయ వృత్తి ఔన్నత్యాన్నీ.. విశిష్టతను తెలియజేస్తుంది. అంతేకాదు.. ప్రపంచంలో సార్ అని ప్రతిఒక్కరూ సంబోధించతగ్గ ఏకైక వ్యక్తి , దేశాధ్యక్షుడు సైతం సార్ అని సంబోధించవలసిన ఏకైక వ్యక్తి ఉపాధ్యాయుడు మాత్రమే. టీచర్ లేకుంటే మనం లేము.. అందుకే ఈ ఉపాధ్యాయ దినోత్సవం వేళ (Teachers day) గురువులందరికీ పాదాభివందనం..