Abhijit Mukherjee: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో కొంతకాలంగా పని చేస్తున్న ఆయన తిరిగి సొంతగూటికి చేరారు. బుధవారం, కోల్‌కతాలో AICC ఇన్‌ఛార్జ్ గులాం అహ్మద్ మీర్, ఇతర రాష్ట్ర నాయకుల సమక్షంలో అభిజిత్ అధికారికంగా పార్టీలో తిరిగి చేరారు. 2021లో కాంగ్రెస్ నుంచి టీఎంసీలో చేరిన ఆయన, తిరిగి రావడాన్ని సొంతింటికి వస్తున్నట్లుగా అభివర్ణించారు.
రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌లో చేరడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో తిరిగి చేరడం రాజకీయంగా సరైన చర్యనా అని అడిగినప్పుడు.. ‘‘కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో పట్టింపు లేదు. నాను కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల టీఎంసీలోకి వెళ్లా. మేము ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చే ఆదేశాలను, బాధ్యతల్ని ముందుకు తీసుకెళ్తాం.’’ అని అన్నారు.
రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ శుభాంకర్ సర్కార్ మాట్లాడుతూ.. ఇది రాష్ట్ర విభాగానికి మంచి ఊపు ఇస్తుందని అన్నారు. 2012 జాంగిపూర్ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో అభిజిత్ 2,536 ఓట్ల తేడాతో గెలిచారు. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి అయిన తర్వాత ఈ సీటు ఖాళీ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి తిరిగి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి ఖలీలూర్ రెహమాన్ చేతిలో ఓడిపోయారు.
ప్రణబ్ ముఖర్జీ కుమార్తె, అభిజిత్ సోదరి శర్మిష్ట ముఖర్జీ ఇటీవల కాంగ్రెస్‌ని విమర్శించారు. ఈ తర్వాత కొన్ని వారాలకే అభిజిత్ కాంగ్రెస్‌లో చేరారు. గత ఏడాది డిసెంబర్‌లో, మాజీ కాంగ్రెస్ సభ్యురాలు శర్మిష్ఠ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ప్రత్యేక స్మారక స్థలాన్ని డిమాండ్ చేస్తూ, తన తండ్రి మరణానికి సంతాపం తెలిపేందుకు వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ప్రణబ్ ముఖర్జీ స్మారక చిహ్నం కోసం ఢిల్లీలోని రాజ్‌ఘాట్ కాంప్లెక్స్‌లోని రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో కేంద్ర ప్రభుత్వం భూమిని కేటాయిస్తున్నట్లు ప్రకటించినప్పుడు, శర్మిష్ఠ ముఖర్జీ ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు