Katra Ropeway Project: జమ్మూకశ్మీర్‌లోని శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయ బేస్‌క్యాంప్ అయిన కాట్రా పట్టణంలో ప్రతిపాదిత రోప్‌వే నిర్మాణ ప్రాజెక్టును నిలిపివేయాలని ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు. బుధవారం నుంచి 72 గంటల పాటు పట్టణం మొత్తం బంద్ కొనసాగించాలని చెప్పుకొచ్చారు. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు నిరసన వ్యక్తం చేస్తున్న వారిని అడ్డుకోవడంతో పలు చోట్ల ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
Read Also:Joe Biden: జో బైడెన్ కీలక నిర్ణయం.. ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు అందిస్తామని వెల్లడి..
అయితే, వైష్ణోదేవి ఆలయానికి యాత్రికులు చేరుకోవడానికి 13 కిలో మీటర్ల పొడవునా ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. ఇక, పిల్లలకు, వృద్ధులకు ఈ ట్రెక్కింగ్ పెను సవాలుగా మారడంతో.. దాన్ని ఈజీగా చేసేందుకు రూ.250 కోట్లతో రోప్‌వే ప్రాజెక్టును నిర్మించాలని పుణ్యక్షేత్ర బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇక, బోర్డు నిర్ణయానికి వ్యతిరేకంగా కాట్ర పట్టణంలో బంద్‌కు పిలుపునిచ్చిన శ్రీ మాతా వైష్ణోదేవి సంఘర్ష్ సమితి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వేల మంది ఉద్యోగాలను కాపాడేందుకే ఈ రోప్‌వే ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే, తాము ప్రభుత్వంతో చర్చలు జరపడానికి బదులుగా పోలీసుల్ని ప్రయోగించి తమను నిర్బంధించడం దురదృష్టకరమని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, బంద్ పిలుపుతో పట్టణంలోని వ్యాపార సంస్థలన్నీ మూతపడటంతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిరసనకు ఇది సరైన సమయం కాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.