Presidential Polls 2022: రాష్ట్రపతి పదవికి జరుగుతున్న ఎన్నికల్లో పంజాబ్‌లో 99 శాతం ఓట్లు యశ్వంత్ సిన్హాకు వస్తున్నాయని పంజాబ్ ప్రతిపక్ష నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా సోమవారం అన్నారు. ఓట్ల రద్దుకు దారితీసే ఎలాంటి పొరపాటు జరగకుండా ఉండేందుకు పంజాబ్ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్‌పీ) సమావేశంలో చెప్పామన్నారు. ‘‘ఓట్ల రద్దుకు దారితీసే పొరపాటు జరగకుండా ఉండేందుకు రాష్ట్రపతి ఎన్నికకు ఓట్లు వేసే ప్రక్రియపై ఎమ్మెల్యేలందరికీ మార్గనిర్దేశం చేశాం. చాలామంది ఎంపీలు ఓట్లు వేయడానికి ఢిల్లీకి వెళతారు, వారు కూడా ఇక్కడికి రావచ్చు. పంజాబ్ నుండి 99 శాతం ఓట్లు యశ్వంత్ సిన్హాకు పోతున్నాయని..” అని బజ్వా అన్నారు.
రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగియనున్న నేపథ్యంలో భారత తదుపరి రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు దేశంలో పోలింగ్ జరుగుతోంది. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) అధ్యక్ష అభ్యర్థి ద్రౌపది ముర్ము, ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హా రాష్ట్రపతి పదవికి ఇద్దరు బరిలో నిలిచారు. ఈరోజు రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం 4,809 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య పోలింగ్ జరగనుంది. జులై 21న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఎన్డీయేకు చెందిన ముర్ముకు బిజూ జనతాదళ్ (బీజేడీ), వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(వైఎస్సార్‌సీపీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే), తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనతాదళ్ (సెక్యులర్), శిరోమణి అకాలీదళ్, శివసేన, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) మద్దతు ఉంది. ద్రౌపది ముర్ము ఎన్నికైతే భారతదేశానికి మొదటి గిరిజన రాష్ట్రపతిగా, రెండవ మహిళా రాష్ట్రపతి కానున్నారు.
ఇదిలా ఉండగా, రాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్షాల అభ్యర్థిగా నామినేట్ కాకముందే సిన్హా టీఎంసీకి రాజీనామా చేశారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో మాజీ కేంద్ర మంత్రి, ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన చెందిన సిన్హాకు కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ), ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ), తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) మద్దతు ఇచ్చాయి.
Presidential Poll 2022: రాష్ట్రంలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కోసం సర్వం సిద్ధం
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 54 ప్రకారం, రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. ఇందులో పార్లమెంట్ ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులతో పాటు అన్ని రాష్ట్రాలు, దిల్లీ, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికైన శాసనసభ సభ్యులుంటారు. వీరంతా ఓటు హక్కు ద్వారా ప్రథమ పౌరుడిని ఎన్నుకొంటారు. రాజ్యసభ, లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లోని నామినేటెడ్ సభ్యులు, రాష్ట్రాల శాసనమండలి సభ్యులు ఎలక్టోరల్ కాలేజీలో ఉండరు. అందుకే వాళ్లకి ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉండదు. ఉపరాష్ట్రపతిని రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు మాత్రమే ఎన్నుకొంటారు.