Rs.2000 note withdrawal: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రూ.2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 30 వరకు ప్రజలు బ్యాంకుల్లో రూ.2000 నోటును మార్చుకునేందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మెజారిటీ భారతీయులు మాత్రం రూ.2000 నోటును మార్చుకునే కన్నా.. బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు మొగ్గు చూపిస్తున్నారని ఓ నివేదిక తేల్చింది. దాదాపుగా 80 శాతం ప్రజలు నోట్లను డిపాజిట్ చేస్తున్నారు. చిన్న నోట్లుగా మార్చుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీనికి బదులుగా వారి ఖాతాల్లో రూ.2000 నోట్లను డిపాజిట్ చేస్తున్నారు.
Read Also: Google Pay: ఇకపై డెబిట్ కార్డ్ అవసరం లేదు.. ఆధార్ తో గుగూల్ పే యాక్టివేషన్..
మే నెలలో రూ.2000 నోటును ఉపసంహరించుకుంటూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 30 వరకు వాటి మార్పిడికి లేదా డిపాజిట్‌కు అనుమతినిచ్చింది. ఒకసారి రూ. 20,000 విలువైన రూ.2000 నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే నోట్లను డిపాజిట్ చేయడానికి ఎలాంటి పరిమితి విధించలేదు. దీంతో ఎక్కువ మంది డిపాజిట్ చేసేందుకే మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఉపసంహరణ ప్రకటించినప్పుడు ఆర్థిక వ్యవస్థలో సర్క్యూలేషన్ లో ఉన్న నోట్ల విలువ 3.6 ట్రిలియన్ రూపాయలుగా ఆర్బీఐ తెలిపింది.
అయితే ఇప్పటి వరకు అకౌంట్లలో జమ చేసిన, మార్చుకున్న మొత్తం నోట్ల విలువ అందుబాటులో లేనప్పటికీ.. ఆరు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకర్లు రాయిటర్స్ తో మాట్లాడుతూ.. తమకు వచ్చిన నోట్లలో 80 శాతం ఖాతాల్లో జమయ్యాయని చెప్పారు. మే 23 నుంచి ఉపసంహరణ ప్రారంభం అయినప్పటి నుంచి మొదటివారంలో సుమారుగా 170 బిలియన్ రూపాయలు పొందినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వెల్లడించింది. ఇందులో 140 బిలియన్లు అంటే 82 శాతం ఖాతాల్లో జమ కాగా.. మిగిలినవి మార్చుకున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు తమకు వచ్చిన నోట్లలో 80-90 శాతం నోట్లు డిపాజిట్ అయినట్లు చెప్పారు. ఇక కొటక్ మహీంద్రా బ్యాంక్ కూడా ఇదే విధంగా ఖాతాల్లో జమయ్యే డబ్బే ఎక్కువగా ఉన్నట్లు పేర్లు వెల్లడించని అధికారులు చెప్పారు. బ్యాంక్ డిపాజిట్ల వృద్ధి 10.9 శాతం పెరగి..కరెన్సీ ఇన్ సర్క్యూలేషన్(CIC) తగ్గవచ్చని ఆర్బీఐ డేటా చూపించింది.