Pakistan: పాకిస్తాన్ చెర నుంచి 80 మంది మత్స్యకారులకు విముక్తి లభించింది. చేపల వేటకు వెళ్లిన వీరు భారత సముద్ర జాలాలు దాడి పాకిస్తాన్ జలాల్లోకి తెలియకుండా వెళ్లడంతో అక్కడి అధికారులు వీరిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరంతా విడుదలై ఈ రోజు తమ కుటుంబాలతో దీపావళి చేసుకునేందుకు సొంతూళ్లకు వెళ్లారు.
పాకిస్తాన్ కరాచీ జైలు నుంచి విడుదలైన వీరంతా ఆదివారం రైలుతో గుజరాత్‌లోని వడోదరకు చేరుకున్నారు. తమ కుటుంబాలను కలుసుకునేందుకు అక్కడి నుంచి గిర్ సోమనాథ్ జిల్లాలోని వెరావల్‌కి తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. మత్స్యకారుల్ని గురువారం పాకిస్తాన్ అధికారులు విడుదల చేశారు. మరుసటి రోజు అట్టారీ-వాఘా సరిహద్దులో గుజరాత్ రాష్ట్ర మత్సశాఖ మంత్రి బృందానికి అప్పగించారు.
Read Also: IND vs NED: నెదర్లాండ్ పై వీర విజృంభణ.. సెంచరీలతో చెలరేగిన శ్రేయాస్, రాహుల్
2020లో గుజరాత్ తీరం నుంచి చేపల వేటకు వెళ్లారు. తమ జలాల్లో చేపలు పట్టారని ఆరోపిస్తూ.. పాకిస్తాన్ మారిటైమ్ దళాలు వీరిని అరెస్ట్ చేశాయి. విడుదలైన 80 మంది జాలర్లలో 59 మంది గిర్ సోమనాథ్ జిల్లాకు చెందిన వారు కాగా.. 15 మంది దేవభూమి ద్వారకకు, ఇద్దరు జామ్ నగర్, ఒకరు అమ్రేలీ చెందిన వారు కాగా.. మరో ముగ్గురు కేంద్రపాలిత ప్రాంతం డయ్యూకు చెందినవారు. వీరంతా 2020లో పట్టుబడ్డారు. దాదాపు 200 మంది భారతీయ మత్స్యకారులు ఇప్పటికీ పాక్ జైళ్లలో మగ్గుతున్నారు. విముక్తి పొందిన వారు తమ కుటుంబ సభ్యులతో దీపావళి జరుపుకుంటుండటంతో భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఏడాది మే, జూన్ లో పాకిస్తాన్ ప్రభుత్వం దాదాపు 400 మంది భారతీయ మత్స్యకారుల్ని విడుదల చేసింది.