NITI Aayog: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి 8 రాష్ట్రాల సీఎంలు గైర్హాజరయ్యారు. ‘‘విక్షిత్ భారత్ @2047: టీమ్ ఇండియా పాత్ర’ అనే అంశంపై నీతి ఆయోగ్ ఎనిమిదో గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి వీరంతా రాలేదు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, తెలంగాణ సీఎం కేసీఆర్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరయి విజయన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, బీహార్ సీఎం నితీష్ కుమార్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమావేశానికి డుమ్మా కోట్టారు.
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోగ్యకారణాల వల్ల రాలేకపోతున్నట్లు వెల్లడించారు. కేరళ సీఎం పినరయి విజయన్ గైర్హాజరుకు ఎలాంటి కారణాలు వెల్లడించలేదు. ఇదిలా ఉంటే ఢిల్లీ అధికారులు బదిలీలు, నియామకాలపై కేంద్ర ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్ తీసుకువచ్చిన తర్వాత సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎన్డీయేతర ప్రతిపక్షాలను కలిస్తూ బిజీగా ఉన్నారు. ఆయన తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా వివిధ రాష్ట్రాల్లోని బీజేపేతర నేతలను కలుస్తున్నారు.
Read Also: Harish Rao: కేసీఆర్ పెట్టిన భిక్షతోనే పదవులు.. రేవంత్, బండి సంజయ్ పై హరీశ్ రావ్ కీలక వ్యాఖ్యలు
ఇక బీజేపీకి వ్యతిరేకంగా కొత్తగా మరో ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్, మమతా బెనర్జీ, నితీష్ కుమార్ లు ఉన్నారు, తరుచుగా వీరంతా కేంద్రం, బీజేపీపై విమర్శలు చేస్తున్నారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. కేంద్రం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఈ సమావేశాన్ని బాయ్ కాట్ చేశారు. అయితే ఎన్డీయే, యూపీఏ కూటములకు సమదూరం పాటిస్తున్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ముందే ఫిక్స్ అయిన ప్రోగ్రాం వల్ల సమావేశానికి హాజరుకావడం లేదని చెప్పారు.
8 మంది సీఎంలు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకాకపోవడంపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ అభివృద్ధి ప్రణాళికకు నీతి ఆయోగ్ ముఖ్యమైనదని, హాజరుకాని ముఖ్యమంత్రులు, వారి రాష్ట్ర ప్రజలు గొంతును వినిపించడం లేదని, మోడీకి వ్యతిరేకంగా ఎంత దూరం వెళ్లారు..? అని ప్రశ్నించారు. బీజేపీయేతర ముఖ్యమంత్రులు సమావేశాన్ని బహిష్కరిస్తున్నారంటే కేంద్రం వారి పట్ల సరైన రీతిలో వ్యవహరించడం లేదని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ అన్నారు. కేంద్రాన్ని ఎవరు పట్టించుకోకపోయినా నీతి ఆయోగ్ తమ డిమాండ్లను వినడం లేదని ఆయన అన్నారు.