Poonch terror attack: గురువారం జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి జరిగింది. పూంచ్ ఉగ్రదాడిలో రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. ఈ దాడిలో మొత్తం 7 గురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు ప్రాథమికంగా నిర్థారించారు. రెండు ఉగ్రవాద గ్రూపులకు చెందినవారు పాల్గొన్నట్లు తేలింది. పాకిస్తాన్ కు చెందిన జైష్-ఎ-మహ్మద్ (జెఇఎం), లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) సహాయంతో ఈ ఉగ్రదాడి జరిగినట్లు శుక్రవారం రక్షణ వర్గాలు తెలిపాాయి. దాడిలో రాకెట్ ప్రొపెల్లడ్ గ్రెనేడ్స్ వాడినట్లు, డజన్ల కొద్ది బుల్లట్స్ ఫైర్ చేసినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.
జమ్మూకాశ్మీర్ రాజౌరి ప్రాంతంలో ఈ రెండు ఉగ్ర సంస్థల ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో కొందరు ఉగ్రవాదులు పనిచేస్తున్నారు. ఈ దాడికి ముందుగా జైషేమహ్మద్ అనుబంధ సంస్థ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (పీఏఎఫ్ఎఫ్) బాధ్యులుగా ప్రకటించుకుంది. అయితే ఈ దాడిలో లష్కరేతోయిబా ఉగ్రవాదులు కూడా పాల్గొన్నట్లు తేలింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి రాజౌరీ, పూంచ్ మీదుగా ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడ్డారనే వార్తలపై నిఘా వర్గాలు దర్యాప్తు చేస్తున్నాయి. పూంచ్-రజౌరీ ప్రాంతంలో భారత సైన్యం మృతి చెందడం ఇది నాలుగో ఘటన. సంఘటన జరిగిన ప్రాంతం భారత్-పాక్ నియంత్రణ రేఖ(ఎల్ఓసీ)లోని భీంబర్ గలి నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. భారత్ వైపు ప్రాంతం దట్టమైన అడవులతో నిండిఉంది. కొన్ని రోజులుగా పాకిస్తాన్ ఉగ్రవాదులు అడవుల్లో నక్కి దాడి చేసినట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ ప్రారంభించాయి. నగ్రోటాకు చెందిన 16 కోర్ సెక్టార్‌లో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నాయి. అయితే జీ-20 సమావేశాలు జమ్మూకాశ్మీర్ లో నిర్వహించడంపై పాకిస్తాన్ అభ్యంతరం తెలుపుతోంది. ఈ సమావేశాలను బహిష్కరించాలని తన ఆల్ వెదర్ ఫ్రెండ్ చైనాను కోరుతోంది. జీ-20 సమావేశాలు మేలో శ్రీనగర్ లో జరుగుతున్న తరుణంలో ఈ ఉగ్రదాడితో భయోత్పాతం సృష్టించాలని పాక్ ప్లాన్ చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.