6 tigers killed in Tadoba Sanctuary: వరసగా పులుల మరణాలు సంభవిస్తున్నాయి. రోజుల వ్యవధిలో ఆరు పులులు మరణించాయి. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలోని తాడోబో-అంధారి అభయారణ్యంలో కొన్ని రోజుల్లోనే 6 పులులు మరణించాయి. శనివారం తాడోబా టైగర్ రిజర్వ్ బఫర్ జోన్ లో నాలుగు పులి పిల్లలు చనిపోయి ఉండటాన్ని అటవీ అధికారులు గుర్తించారు. పులి పిల్లలపై కొరికిన గాయాలు ఉన్నట్లు అటవీ అధికారులు వెల్లడించారు. పెద్దపులి దాడిలో ఇవి చనిపోయి ఉండొచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. శనివారం ఉదయం బఫర్ జోన్ లోని శివని ఫారెస్ట్ రేంజ్ వద్ద మూడు నుంచి 4 నెలల వయస్సు ఉన్న రెండు మగ, రెండు ఆడ పులిపిల్లల మృతదేహాలను కొనుగొన్నట్లు రిజర్వ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ జితేంద్ర రామ్‌గావ్‌కర్ తెలిపారు.
Read Also: Canada: భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పిన కెనడా..
టైగర్ రిజర్వ్ లోని మొహర్లీ పరిధిలోని కంపార్ట్మెంట్ 186 పరిధిలో 6-7 నెలల వయస్సు ఉన్న పులి గురువారం చనిపోయింది. దీని శరీరంపై కూడా గాయాలు ఉన్నాయి. బుధవారం శివని పరిధిలో ఓ పులి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. 15-16 ఏళ్ల వయస్సు ఉన్న పులిగా గుర్తించారు. వృద్ధాప్య కారణాల వల్ల పులి చనిపోయి ఉండవచ్చని అటవీ అధికారులు భావిస్తున్నారు. శరీరంపై ఎలాంటా గాయాలు కనిపించలేదు. మృతదేహాలను శవపరీక్ష కోసం ట్రాన్సిట్ ట్రీట్మెంట్ సెంటర్ కు పంపారు. ఆ ప్రాంతంతో మగపులి సంచరిస్తున్నట్లు గుర్తించారు అటవీ అధికారులు.
అయితే గాయపడి చనిపోయిన పులులు, మరో పులి దాడిలో గాయపడిచనిపోయినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాల్లో తాడోబా అభయారణ్యం ఆవరించి ఉంది. ఇక్కడ దాదాపుగా 40కి పైగా పులులు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఈ అభయారణ్యం నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ లో ఉన్న కవ్వాల్ అభయారణ్యానికి పులులు వస్తూ పోతూ ఉన్నాయి.