Lumpy Disease: గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ సహా ఆరు-ఏడు రాష్ట్రాల్లో లంపి చర్మ వ్యాధి వ్యాపించింది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈ లంపి చర్మ వ్యాధి కారణంగా ఇప్పటివరకు సుమారు 57,000 పశువులు చనిపోయాయని, వ్యాధిని నియంత్రించడానికి టీకా ప్రక్రియను పెంచాలని బాధిత రాష్ట్రాలను కేంద్రం గురువారం కోరింది.
లంపి చర్మ వ్యాధి(LSD) అనేది ఒక వైరల్ వ్యాధి, ఇది పశువులను ప్రభావితం చేస్తుంది. జ్వరం, చర్మంపై నోడ్యూల్స్‌తో పాటు మరణానికి కూడా దారితీస్తుంది. ఈ వ్యాధి దోమలు, ఈగలు, పేనులు, కందిరీగలు, పశువుల మధ్య ప్రత్యక్ష సంబంధం, కలుషితమైన ఆహారం, నీటి ద్వారా వ్యాపిస్తుంది. ప్రధాన లక్షణాలు జంతువులలో జ్వరం, కళ్ళు మరియు ముక్కు నుండి స్రావాలు, నోటి నుండి లాలాజలం, శరీరమంతా నోడ్యూల్స్ వంటి మృదువైన పొక్కులు, పాల ఉత్పత్తి తగ్గడం, తినడానికి ఇబ్బంది, ఇది కొన్నిసార్లు జంతువు మరణానికి దారితీస్తుంది. “గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా మరియు ఉత్తరప్రదేశ్‌తో సహా ఆరు-ఏడు రాష్ట్రాల్లో లంపి చర్మ వ్యాధి వ్యాపించింది. ఆంధ్రప్రదేశ్‌లో, కొన్ని కేసులు నమోదయ్యాయి” అని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా విలేకరులతో అన్నారు. సెప్టెంబర్ 12-15 మధ్య భారతదేశంలో నిర్వహించబడుతున్న ఐడీఎఫ్ వరల్డ్ డే సమ్మిట్‌ను ప్రకటించే సందర్భంగా ఈ వ్యాధి గురించి మాట్లాడారు.
పరిస్థితిని అంచనా వేయడానికి, నియంత్రణ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి తాను ఐదు రాష్ట్రాలను సందర్శించినట్లు కేంద్ర మంత్రి చెప్పారు. మంత్రిత్వ శాఖ ప్రతిరోజూ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. లంపి వ్యాధికి వ్యతిరేకంగా ‘గోట్ పాక్స్ వ్యాక్సిన్’ ప్రభావవంతంగా పని చేస్తోందన్నారు. టీకా ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. గుజరాత్‌లో పరిస్థితి మెరుగుపడిందని, పంజాబ్, హర్యానాలో వ్యాధి అదుపులో ఉందని రూపాలా చెప్పారు. రాజస్థాన్‌లో ఈ వ్యాధి విస్తరిస్తోంది. ఇప్పటి వరకు పాల ఉత్పత్తిపై ఎలాంటి ప్రభావం పడలేదని మంత్రి తెలిపారు.
CDS General Bipin Rawat: ఆర్మీ స్థావరానికి దివంగత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ పేరు
వ్యాక్సినేషన్‌లో పెరుగుదల, వ్యాధిని నియంత్రించడానికి ప్రోటోకాల్‌ను అనుసరించడం ద్వారా వ్యాధిని నియంత్రించవచ్చని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల వెల్లడించారు. చనిపోయిన పశువులను ఖననం చేసే ప్రొటోకాల్‌ను పాటించాలని మంత్రి రాష్ట్రాలకు సూచించారు.పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ కార్యదర్శి జతీంద్ర నాథ్ స్వైన్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు 57,000 పశువులు చనిపోయాయని, వాటిలో 37,000 రాజస్థాన్‌లో ఉన్నాయని చెప్పారు. రాజస్థాన్‌పై ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. కేంద్రం ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు సలహాలు పంపుతోందని చెప్పారు.