బీహార్‌లో దారుణం జరిగింది. నర్సరీ విద్యార్థి స్కూల్‌లో తుపాకీతో హల్‌చల్ చేశాడు. ఓ విద్యార్థిపై కాల్పులకు తెగబడ్డాడు. చేతికి బుల్లెట్ తగలడంతో హుటాహుటినా పాఠశాల సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతో స్కూల్ యాజమాన్యం షాక్‌కు గురైంది. సుపాల్ జిల్లాలోని సెయింట్ జోన్ బోర్డింగ్ స్కూల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఐదేళ్ల నర్సరీ విద్యార్థి స్కూల్ బ్యాగ్‌లో తుపాకీ తీసుకొచ్చాడు. పాఠశాలకు వచ్చాక.. 3వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలుడిపై కాల్పులు జరిపాడు. దీంతో చేతికి బుల్లెట్ తగలడంతో సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. పాఠశాలకు వచ్చి సంఘటనాస్థలిని పరిశీలించి.. తుపాకీ, బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అసలు బాలుడు స్కూల్‌కి తుపాకీ ఎలా తీసుకొచ్చాడన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా స్కూల్ యాజమాన్యం తీరుపై కూడా పోలీసులు మండిపడ్డారు. స్కూల్ ప్రిన్సిపాల్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఇంత పెద్ద నిర్లక్ష్యం ఎలా జరిగిందంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే కాల్పులు జరిపిన విద్యార్థి తండ్రి కోసం కూడా ఆరా తీస్తున్నారు. మరోవైపు భయాందోళనకు గురైన తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల బ్యాగులను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని పాఠశాలలకు సీనియర్ పోలీసు అధికారి ఆదేశించారు.
ఆస్పత్రిలో కోలుకుంటున్న బాధిత బాలుడిని పోలీసులు ప్రశ్నించారు. స్కూల్‌లో తనకు ఎవరితోనూ గొడవలు లేవని చెప్పాడు. తుపాకీతో కాల్చిన అబ్బాయితో కూడా ఘర్షణ లేదని చెప్పాడు. తాను క్లాస్ రూమ్‌లోకి వెళ్తుంటే బ్యాగ్‌లోంచి తుపాకీ తీసి కాల్పులు జరిపినట్లు పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే ఈ ఘటనతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తం అయింది. ఇకపై విద్యార్థుల స్కూళ్ల బ్యాగ్‌లు తనిఖీలు చేయాలని సూచిస్తున్నారు.