Tamil Nadu: తమిళనాడులో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. కన్యాకుమారి తీరంలో సోమవారం ఇద్దరు మహిళతో సహా ఐదుగురు వైద్యవిద్యార్థులు సముద్రంలో మునిగి చనిపోయారు. విద్యార్థులు తమ వైద్య విద్యను మరికొన్ని రోజుల్లో ముగించనున్నారు. వీరంతా ఎంజాయ్ చేసేందుకు ప్రైవేట్ బీచ్‌కి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. మృతులు ఒక కొబ్బరి తోట నుంచి మూసి ఉన్న లైమూర్ బీచ్‌కి వెళ్లారని, ఆ ప్రాంతంలో సముద్ర అలలు భయంకరంగా ఉంటాయని, ఈత కొట్టే సమయంలో వీరంతా నీటిలో మునిగిపోయినట్లు కన్యాకుమారి జిల్లా ఎస్పీ ఈ. సుందరవతనం చెప్పారు.
Read Also: PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే ఏపీ అభివృద్ధి సాధ్యం
మొత్తం 12 మంది మెడికల్ కాలేజీ విద్యార్థులు కన్యాకుమారి జిల్లాకు చెందిన డాక్టర్ ముత్తుకుమార్ సోదరుడి వివాహాం కోసం ఆదివారం నాగర్ కోయిల్ వచ్చారు. ఈ రోజు ఉదయం కన్యాకుమారిలోని గణపతిపురం సమీపంలోని లైమూర్ బీచ్‌కి స్నానం చేసేందుకు వెళ్లగా భారీ కెరటం 9 మందిని సముద్రంలోకి లాగేసింది. ఆ సమయంలో మత్స్యకారులు నలుగురిని కాపాడారు. ఈ ఘటనలో తంజావూరుకు చెందిన సారుకవి (24), నైవేలికి చెందిన గాయత్రి (25), ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వెంకటేష్ (24), దిండిగల్‌కు చెందిన ప్రవీణ్ (23), కుమారికి చెందిన సర్వదర్శిత్ (23) అనే ఐదుగురు వ్యక్తులు మరణించారు. వీరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కన్యాకుమారి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో ఉంచారు. మరో ముగ్గురు మహిళా ఇంటర్న్‌లు కరూర్‌కు చెందిన నేషి, తేనికి చెందిన ప్రీతి ప్రియాంక మరియు మదురైకి చెందిన శరణ్యలను రక్షించి ఆసారిపల్లం మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు.