మహారాష్ట్రలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 41,434 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 9,671 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 13 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో 1,73,238 యాక్టివ్ కేసులు ఉండగా, మొత్తం ఇప్పటి వరకు కరోనాతో 1,41,627 మంది మృతి చెందారు. ముంబై నగరంలో గడిచిన 24 గంటల్లో 20,318 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ముంబైలో 5 మంది మృతి చెందారు. ఒక్క ముంబై నగరంలోనే 1,06,037 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కరోనా ఆసుపత్రుల్లో 21.4 శాతం బెడ్స్ ఆక్యుపై అయ్యాయని వైద్యాధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ముంబై నగరంలో మాత్రమే నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కాగా, ఇప్పుడు రాష్ట్రం మొత్తం నైట్ కర్ఫ్యూ అమలు చేయనున్నారు.
Read: పార్లమెంట్‌లో కరోనా కలకలం: 350 మంది సిబ్బందికి పాజిటివ్…
ఇక ఇదిలా ఉంటే, పశ్చిమ బెంగాల్‌లో 24 గంటల్లో 18,802 కేసులు నమోదవ్వగా, 19 మంది మృతి చెందారు. బెంగాల్‌లో 62,055 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. బెంగాల్‌లో అత్యధికంగా 29.6శాతం పాజిటివిటీ రేటు ఉన్నట్టు ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. ఇక కేరళ రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కేరళ రాష్ట్రంలో 5,944 కొత్త కేసులు నమోదయ్యాయి. 33 మంది కరోనాతో మృతి చెందారు. కేరళలో ప్రస్తుతం 31,098 యాక్టీవ్ కేసులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.