31 From Karnataka Stuck In Sudan: ఆఫ్రికా దేశం సూడాన్ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. అక్కడి సైన్యం, పారామిటిలరీ మధ్య తీవ్రం ఘర్షణ ఏర్పడింది. ఈ రెండు దళాల అధిపతుల మధ్య తీవ్ర ఘర్షణ దేశాన్ని, అక్కడి ప్రజలు ప్రమాదంలోకి నెట్టింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. రాజధాని ఖార్టూమ్ లో ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ ఘర్షణల్లో 200 మంది మరణించాగా.. 1800 మంది గాయపడ్డారు. సూడాన్ లో పనిచేస్తున్న ఓ కేరళ వాసి బుల్లెట్ గాయాలతో చనిపోయాడు.
Read Also: Ajit Pawar: ఎన్సీపీకి షాక్ ఇవ్వనున్న అజిత్ పవార్.. 30 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలోకి..?
ఇదిలా ఉంటే కర్ణాటకు చెందిన 31 మంది గిరిజనులు సూడాన్ లో చిక్కుకున్నారు. కర్ణాటక రాష్ట్ర విపత్తు నిర్వహాణ అథారిటీ(KSDMA) సూడాన్ లో చిక్కుకుపోయిన వారికి సహాయం అందించాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమాచారం అందించింది. కర్ణాటకకు చెందిన 31 మంది సూడాన్ లో చిక్కుకుపోయినట్లు తెలిసింది. మేము ఈ విషయాన్ని విదేశీ మంత్రిత్వ శాఖకు తెలియజేశాం. సూడాన్ లోని రాయబార కార్యాలయం సూచనలను పాటించాల్సిందిగా వారిని కొరామని, ఎక్కడ ఉన్నా బయటకు వెళ్లవద్దని, రాయబార అధికారులు ఈ విషయంపై పనిచేస్తున్నట్లు కేఎస్డీఎంఏ కమిషనర్ డాక్టర్ మనోజ్ రాజన్ తెలిపారు.
ఈ విషయంపై కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ, విదేశీ వ్యవహారాల శాఖ జోక్యం చేసుకోవాలని, సూడాన్ లో చిక్కుకుపోయిన వారిని రక్షించాలని ట్విట్టర్ ద్వారా కోరారు. వీరంతా హక్కీపిక్కీ తెగకు చెందిన వారిగా ఆయన పేర్కొన్నారు.
2021లో సైనిక తిరుగుబాటు తర్వాత దేశంలో అధికారాన్ని చేజిక్కించుకున్న ఆర్మీ చీఫ్ అబ్దెల్ ఫత్తా అల్-బుర్హాన్, పారామిలిటరీ ఫోర్స్ కమాండర్ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లో మధ్య వివాదం, ఘర్షణగా మారింది. 2021లో వీరిద్దరు అక్కడి మాజీ అధ్యక్షుడు ఒమర్ అల్ బషీర్ ప్రభుత్వాన్ని పడగొట్టారు. సూడాన్ సైన్యంలో, పారామిలిటరీని ఏకీకృతం చేయాలనే ప్రతిపాదనతో ఈ ఘర్షణ చెలరేగింది.