Earthquake: గుజరాత్ లోని సూరత్ నగరంలో శనివారం తెల్లవారుజామున భూమి కంపించిందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ (ఐఎస్‌ఆర్) వెల్లడించింది. సూరత్ కు పశ్చిమనైరుతికి 27 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. 3.8 తీవ్రతతో భూకంపం వచ్చిందని దీనివల్ల సూరత్ తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్లు తెలిపింది. భూకంప కేంద్రం సూరత్ జిల్లా హజీరా ప్రాంతంలోని అరేబియా సముద్రంలో 5.2 కిలోమీటర్ల లోతులో ఉంది. ఈ ప్రకంపనల వల్ల ఆస్తినష్టం, ప్రాణ నష్టం సంభవించలేదు.
Read Also: Air Asia: ఎయిర్ ఏసియాకు రూ.20 లక్షలు ఫైన్..కారణమిదే!
గుజరాత్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రకారం, రాష్ట్రంలో 1819, 1845, 1847, 1848, 1864, 1903, 1938, 1956, 2001లో పెద్ద భూకంపాలు సంభవించాయి. 2001 కచ్ భూకంపం గత రెండు శతాబ్దాలుగా భారతదేశంలో మూడవ అతిపెద్ద మరియు రెండవ అత్యంత విధ్వంసక భూకంపంగా నమోదు అయింది. దీని వల్ల 13,800 మందికి పైగా మరణించారు. 1.67 లక్షల మంది గాయపడ్డారు.
ఇదిలా ఉంటే టర్కీ-సిరియా ప్రాంతంతో సోమవారం భారీ భూకంపం సంభింవించిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేల్ పై 7.8, 7.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీని వల్ల టర్కీ దక్షిణ భాగం తీవ్రంగా దెబ్బతింది. టర్కీ, సిరియా రెండు దేశాల్లో కలిపి మరణాల సంఖ్య 24,000లను దాటింది. శిథిలాలు తొలగించే కొద్దీ మరింతగా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ భూకంపం వల్ల 2.3 కోట్ల మంది ప్రభావితం అయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అంచనా వేసింది. టర్కీ భూకంప బాధితులను ఆదుకునేందుకు భారత్ తో పాటు ప్రపంచ దేశాలు ముందుకు వచ్చాయి.