Prajwal Revanna Video Case: కర్ణాటకలో జేడీఎస్ నేత, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ వీడియోలు కలకలం రేపుతున్నాయి. నిన్న ఈ వీడియోలు రాష్ట్రంలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా రేవణ్ణ కుటుంబానికి కంచుకోటగా ఉన్న హసన్ జిల్లాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ప్రజ్వల్ రేవణ్ణతో పాటు అతని తండ్రి హెచ్డీ రేవణ్ణపై ఓ మహిళ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని కేసు పెట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజ్వల్ నిన్న బెంగళూర్ నుంచి జర్మనీ వెళ్లారు. మరోవైపు ఈ కేసును విచారించేందుకు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ పరిస్థితులు పొత్తులో ఉన్న బీజేపీ-జేడీయూ పార్టీలకు ఇబ్బందికరంగా మారాయి.
మరోవైపు మాజీ సీఎం, దేవెగౌడ కొడుకు కుమారస్వామి వీటిపై స్పందించారు. ఇది రేవణ్ణ కుటుంబానికి సంబంధించిన సమస్య. దీనికి మాకు సంబంధం లేదని చెప్పారు. ఈ సమస్యలోకి తన తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడను ఎందుకు తెస్తున్నారని ప్రశ్నించారు. నిజంగా ఆ వ్యక్తి తప్పు చేసినట్లు తేలింది శిక్షించాల్సి ఉంటుందని అన్నారు. అయితే, వీటిని ఎవరు విడుదల చేశారు, ఎన్నికల ముందే ఎందుకు విడుదల చేశారు..? అని అనుమానం వ్యక్తం చేశారు.
మరోవైపు ఈ వ్యవహారంపై బీజేపీ నేత, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి బీవై విజయేంద్రకు రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అందులో దాదాపుగా 3000 సెక్స్ వీడియోలతో కూడి పెన్‌డ్రైవ్ తన వద్ద ఉందని, పార్టీ అధ్యక్షుడికి చెప్పారు. మహిళల్ని బ్లాక్మెయిల్ చేసేందుకు ఈ వీడియోలను ఉపయోగించారని, వీటి వల్ల బీజేపీ-జేడీఎస్ కూటమికి నష్టం ఏర్పడుతుందని కర్నాటక బీజేపీ నేత లేఖలో పేర్కొన్నారు.
Read Also: T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ ఉండాల్సిందే..! తేల్చిచెప్పిన కెప్టెన్
డిసెంబర్ 2023లో రాసిన లేఖలో మొత్తం 2976 వీడియోలు ఉన్నాయని, ఫుటేజీలో ఉన్న కొందరు మహిళా ప్రభుత్వ అధికారులుగా కనిపిస్తున్నారని దేవరాజే గౌడ లేఖలో పేర్కొన్నారు. ఈ వీడియోలు వారిని లైంగిక కార్యకలాపాల్లో నిమగ్నమయ్యేలా బ్లాక్మెయిల్ చేయడానికి ఉపయోగించారని ఆరోపించారు. ఈ వీడియోలు, ఫోటోలతో కూడి మరో పెన్ డ్రైవ్ కాంగ్రెస్ నేతలకు కూడా చేరిందని బీజేపీ నేత పేర్కొన్నారు. జేడీఎస్‌తో పొత్తు పెట్టుకుని హసన్ ఎంపీ స్థానాన్ని అతనికి కేటాయిస్తే రేపిస్టులకు మద్దతు ఇచ్చిన పార్టీగా బీజేపీని చూస్తారని, మన పార్టీ ప్రతిష్టకు దెబ్బ పడుతుందని దేవరాజేగౌడ తన లేఖలో పేర్కొన్నారు.
మరోవైపు అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని జేడీఎస్‌లోని నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజ్వల్ రేవణ్ణ ఇంట్లో పనిచేసే 47 ఏళ్ల మహిళ ఆయనతో పాటు అతని తండ్రి హెచ్డీ రేవణ్ణపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసింది. హెచ్డీ రేవణ్ణ తన భార్య ఇంట్లో లేని సమయంలో స్టోర్ రూంకి మహిళల్ని పిలిపించి చీర పిన్నులు తీసేవాడని, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడే వాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ప్రజ్వల్ తన కుమార్తెతో సరసాలాడేందుకు ప్రయత్నించాడని పేర్కొంది.