Girls Missing: మధ్యప్రదేశ్ 26 మంది బాలికలు అదృశ్యమయ్యారు. రాజధాని భోపాల్ ప్రాంతంలో నిర్వహిస్తున్న ఓ అక్రమ షెల్టర్ హోమ్ నుంచి గుజరాత్, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 26 మంది బాలికలు మిస్సైనట్లు అధికారులు తెలిపారు. బాలికల్లో ఎక్కువగా గుజరాత్, జార్ఖండ్, రాజస్థాన్‌లకు చెందిన వారు కాగా.. కొందరు మధ్యప్రదేశ్‌లోని సెహోర్, రైసెన్, చింద్వారా, బాలాఘాట్‌లకు చెందిన వారు ఉన్నారు.
జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) చైర్మన్ ప్రియాంక్ కనుంగో భోపాల్ శివార్లలోని పర్వాలియా ప్రాంతంలోని ఆంచల్ బాలికల హాస్టల్‌ను ఆకస్మికంగా సందర్శించినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రిజిస్టర్‌ని పరిశీలించగా.. అందులో 68 మంది బాలికలు ఉండగా.. 26 మంది గల్లంతైనట్లు గుర్తించారు. మిస్ అయిన బాలికల గురించి షెల్టర్ హోమ్ డైరెక్టర్ అనిల్ మాథ్యూని ప్రశ్నించగా.. సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో చర్యలు తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
‘‘ఈ చిల్డ్రన్స్ హోమ్ గత 4-5 ఏళ్లుగా ఉందని, ఎవరిని లోనికి రానివ్వరు. అమ్మాయిలను కొన్నిసార్లు మార్కెట్‌కి తీసుకెళ్తారు. తరుచుగా 2-3 వాహనాలు అర్థరాత్రి వరకు ఇక్కడకు వచ్చి 2-3 గంటలకు తిరిగి వెళ్లేవి. రాత్రిపూట మేడమ్ అమ్మాయిలను బజారుకు, స్కూల్‌కి తీసుకొచ్చే పనిచేసేది’’ అని స్థానికుడైన పవన్ చెప్పారు.
Read Also: Bharat Jodo Nyay Yatra: భారత్ జోడో న్యాయ్ యాత్ర లోగోను విడుదల చేసిన ఖర్గే
హాస్టల్‌లో క్రిస్టియన్ ఆచారాలను బలవంతంగా ఆచరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేంద్రంలో 68 మంది పిల్లలు నమోదై ఉంటే ప్రస్తుతం 41 మంది బాలికలు మాత్రమే ఉన్నారు. దీనిపై నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) చీఫ్ ప్రియాంక్ కనూంగో మధ్యప్రదేశ్ చీఫ్ సెక్రటరీ వీర రాణాకు లేఖ రాసి ఏడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కోరారు.
‘‘చాలా మంది SC/ST పిల్లలు ఉన్నారు, వీరిలో ఎక్కువ మంది హిందువులు మరియు ముగ్గురు ముస్లిం బాలికలు క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నారు. ఈ పిల్లల గురించి మాకు సమాచారం ఉంటే, వారికి స్కాలర్‌షిప్‌లు వచ్చేవి. వారు తల్లిదండ్రుల వద్దకు వెళ్లారని చెబుతున్నారు. వారు ఎక్కడికి వెళ్లారనే దానిపై వివరాలు లేవు. జార్ఖండ్, గుజరాత్ ప్రాంతాల నుంచి పిల్లుల ఇక్కడి ఎలా వచ్చారనేది పెద్ద ప్రశ్న. ’’అని చైల్డ్ కమిషన్ మధ్యప్రదేశ్ సభ్యురాలు నివేదిత శర్మ అన్నారు. ఈ అదృశ్యంపై అధికార బీజేపీపై కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది.