Ganesh Immersion: మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో గణేష్ నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. వేర్వేరు ఘటనల్లో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోగా.. వారిలో 14 మంది నీటిలో మునిగి మరణించారని పోలీసులు వెల్లడించారు. ఆగస్టు 31న ప్రారంభమైన 10 రోజుల గణేష్ ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. వార్ధా జిల్లాలో సావాంగి వద్ద ముగ్గురు వ్యక్తులు మునిగిపోగా, దేవ్లీ వద్ద మరొకరు ఇదే విధంగా మరణించారని ఒక అధికారి తెలిపారు.
విగ్రహ నిమజ్జనం సందర్భంగా యవత్మాల్ జిల్లాలో ఇద్దరు వ్యక్తులు చెరువులో మునిగి చనిపోయారు. అహ్మద్‌నగర్ జిల్లాలో, సూపా, బెల్వండిలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మునిగిపోయారు. ఉత్తర మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో మరో ఇద్దరు మరణించారని ఆయన చెప్పారు. చలిస్‌గావ్, జామ్నర్‌లో ఒక్కొక్కరు మృతి చెందారు. పుణే జిల్లాలోని ఘోడేగావ్, యావత్, ధులే జిల్లాలోని లొనికండ్, సతారా జిల్లాలోని లోనికండ్, షోలాపూర్ నగరంలో ఒక్కొక్కరు మరణించారని ఆయన చెప్పారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా నాగ్‌పూర్ నగరంలోని సకర్దారా ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించారని ఆయన తెలిపారు.
థానేలో భారీ వర్షాల కారణంగా కోల్‌బాద్ ప్రాంతంలోని గణేష్ పండల్‌పై చెట్టు కూలడంతో 55 ఏళ్ల మహిళ మృతి చెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని పౌరసరఫరాల శాఖ అధికారి ఒకరు తెలిపారు. నిమజ్జనానికి ముందు గణేష్ విగ్రహం ‘ఆరతి’ జరుగుతుండగా పండల్‌పై భారీ వృక్షం పడింది. ఈ ప్రమాదంలో రాజశ్రీ వాళవల్కర్ అనే మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమెతో పాటు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆమె చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆయన వెల్లడించారు.
ఇదిలావుండగా.. రాయ్‌గఢ్ జిల్లాలోని పన్వేల్ వద్ద ఊరేగింపు సందర్భంగా విద్యుత్ షాక్‌తో తొమ్మిది నెలల చిన్నారి సహా 11 మంది గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం వాద్ఘర్ కోలివాడలో విద్యుత్ జనరేటర్ కేబుల్ తెగిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుందని అధికారి తెలిపారు. ఊరేగింపులో భాగమైన కనీసం 11 మంది వ్యక్తులు విద్యుదాఘాతం వల్ల గాయపడ్డారని.. గాయపడిన వారిలో నలుగురు పిల్లలు ఉన్నారని ఆయన చెప్పారు. వారిలో కొందరిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. మరికొందరిని పన్వేల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, అందరూ చికిత్సకు బాగా స్పందిస్తున్నారని ఆయన చెప్పారు. నిమజ్జనం సందర్భంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో శాంతిభద్రతలకు సంబంధించిన కొన్ని సంఘటనలు కూడా నమోదయ్యాయి.
Man Rescues Daughter: ‘టేకెన్’ మూవీ తరహాలో.. కిడ్నాప్ అయిన కూతురును రక్షించుకున్న రోజువారీ కూలీ
అహ్మద్‌నగర్ జిల్లాలోని తోఫ్‌ఖానాలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే మద్దతుదారుల మధ్య వాగ్వాదం జరిగినట్లు ఓ అధికారి తెలిపారు. జల్గావ్‌లో గణేష్ నిమజ్జన ఊరేగింపు సందర్భంగా మేయర్ బంగ్లాపై కొంతమంది వ్యక్తులు రాళ్లు రువ్వారు, పుణె నగరంలోని ముంధ్వా వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. పుణె జిల్లాలోని షిక్రాపూర్‌లో బాణాసంచా పేల్చడంపై ఘర్షణ చోటుచేసుకోగా, చంద్రాపూర్‌లో గణేష్ మండల్ వాలంటీర్లు, పోలీసు సిబ్బంది మధ్య ఘర్షణ జరిగింది. ముంబైలో గణేష్ ఉత్సవం, నిమజ్జన ఊరేగింపు ప్రశాంతంగా ముగిసిందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని పోలీసులు తెలిపారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా భక్తులకు సేవ చేసే అవకాశం లభించిందని ముంబై పోలీసులు తెలిపారు.