Borewell Incident: రోజుల వ్యవధిలో రెండు బోరుబావి సంఘటనలు విషాదంగా మారాయి. ఇటీవల రాజస్థాన్‌లో చేతన అనే 3 ఏళ్ల బాలిక బోరుబావిలో పడిపోయింది. 10 రోజుల రెస్క్యూ తర్వాత విగతజీవిగా బయటకు తీసుకువచ్చారు. తాజాగా, గుజరాత్ కచ్‌లో బోరుబావిలో పడిన 18 ఏళ్ల యువతి ఇంద్రా మీనా ఘటన కూడా విషాదంగా మారింది. 33 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత యువతి మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. ఎన్డీఆర్ఎఫ్, బీఎస్ఎఫ్ ఇతర ఏజెన్సీల ప్రయత్నం వృథాగా మారింది.
Read Also: Amit Banerji: విషాదం.. టేబుల్ స్పేస్ వ్యవస్థాపకుడు అమిత్ బెనర్జీ అకాల మరణం
కచ్ జిల్లా భుజ్ తాలూకాలోని కండేరాయ్ గ్రామంలో సోమవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 540 అడుగుల లోతున్న బావిలో యువతి పడిపోయింది. 490 అడుగుల లోతులో ఇరుక్కుపోయింది. గంటల తరబడి బోరుబావిలో చిక్కుకుపోవడం వల్ల ఇంద్రా మీనాకు గాయాలతో ప్రాణాలు విడిచింది. సుదీర్ఘంగా బోరుబావిలో ఉండటం వల్ల ఆమె శరీరం ఉబ్బి, బయటకు తీయడం కష్టంగా మారింది.
ఆమె మరణానికి బోరుబావిలో పడటం కారణమా లేక, ఇందులో ఏదైనా కుట్ర ఉందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్టం తర్వాత అసలు కారణాలు తెలియనున్నాయి. మరణించిన యువతి రాజస్థాన్‌కి చెందిన వలసకూలీ కుటుంబానికి చెందినది. ఇంతపెద్ద వయసు ఉన్న యువతి బోరుబావిలో పడిందన వార్తపై ముందుగా అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. సోమవారం మధ్యాహ్నం కెమెరా సాయంతో ఆమె బోరుబావిలో ఉన్నట్లు నిర్ధారించి, రెస్క్యూ కార్యక్రమాలు మొదలుపెట్టారు.