NEET: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) విద్యార్ధుల ఆత్మహత్యలు ఆగడం లేదు. చదువుల వల్ల ఒత్తిడి, తల్లిదండ్రుల కలలను నేరవేర్చలేమో అనే దిగులుతో చాలా మంది విద్యార్థుల ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. రాజస్థాన్ కోటాలో ఇప్పటికే చాలా మంది పిల్లలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. తాజాగా 16 ఏళ్ల నీట్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుని మరణించాడు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కోటా నగరంలో ఇలా ఆత్మహత్యలకు పాల్పడటం విచారం కలిగిస్తోంది.
ఇప్పటి వరకు ఈ ఏడాదిలో 25 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని మరణించారు. కేవలం 8 నెలల వ్యవధిలోనే ఇంత మంది ఆత్మహత్యలు చేసుకోవడం కలవరపరుస్తోంది. రాంచీకి చెందిన 16 ఏళ్ల విద్యార్థి బాత్రూంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సదరు విద్యార్థి కోటాలోని బ్లేజ్ హాస్టల్ ఓ ఉంటున్నాడు. నీట్ పరీక్షలో అర్హత సాధించాలని ఏటా దాదాపుగా 2 లక్షల మంది విద్యార్థులు కోటాకు కోచింగ్ కోసం వస్తారు.
Read Also: India: నేడు ఇండియా కూటమి సమన్వయ కమిటీ భేటీ.. సీట్ల షేరింగే ప్రధాన ఎజెండానా?
రాజస్థాన్ పోలీసులు ప్రకారం ఆత్మహత్యలను పరిశీలిస్తే 2022లో 15 మంది, 2019లో 18 మంది, 2018లో 20 మంది, 2017లో ఏడుగురు, 2016లో 17 మంది, 2015లో 18 విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. 2020, 2021లో ఒక్క విద్యార్థి కూడా ఆత్మహత్యకు పాల్పడలేదు. కోవిడ్ కారణంగా ఈ రెండేళ్లు కోటాలోని అన్ని కోచింగ్ సెంటర్లు మూసేయడంతో ఆత్మహత్యలు జరగలేదు. ఇటీవల ఆత్మహత్యలు పెరుగుతున్న కారణంగా కోటాలోని హాస్టళ్లలో సీలింగ్ ఫ్యాన్లకు స్ప్రింగ్స్ బిగించారు. పెయింగ్ గెస్ట్ వసతిని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆత్మహత్యలను నిరోధించేందుకు పిల్లలకు మానసిక ఒత్తిడి తగ్గించేలా మద్దతు ఇవ్వాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. పెరుగుతున్న ఆత్మహత్యల నివారణకు సిఫారసులు చేయాలని రాజస్థాన్ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.