Ram Mandir: అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవానికి అంతా సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. అయోధ్యతో పాటు యూపీ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. ప్రధాని నరేంద్రమోడీ ప్రత్యేక అతిథిగా, దేశవ్యాప్తంగా 7000 మంది ప్రముఖులు ఈ వేడులకు అతిథులుగా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో నగరం వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
జనవరి 22న రామ్ లల్లా విగ్రహ ‘ప్రాణ్ ప్రతిష్ట’ జరిగే రోజున అయోధ్యలో 100 చార్టర్డ్ విమానాలు ల్యాండ్ అవుతాయని సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. యూపీకి 4వ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇచ్చినందుకు ప్రధాని మోడీకి యోగి కృతజ్ఞతలు తెలిపారు. డిసెంబర్ 30, 2023లో ప్రధాని నరేంద్రమోడీ అయోధ్య విమానాశ్రయంతో పాటు ఇతర అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు.
Read Also: Earthquake: ఢిల్లీలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.0గా నమోదు..
ఇదిలా ఉంటే జనవరి 16 నుంచి అయోధ్యంలో రామ మందిర వేడుకలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం భద్రతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) బుధవారం చేపట్టింది. ఈ విభాగానికి డిప్యూటీ కమాండెంట్ ర్యాంక్ అధికారి నేతృత్వం వహిస్తారు. అయోధ్యంలో అధునాతన భద్రత మరియు ట్రాఫిక్ నిర్వహణ చర్యలతో కూడిన సమగ్ర ప్రణాళికను అమలు చేసింది.
భద్రతా చర్యల్లో భాగంగా ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ITMS) నగరం అంతటా 1500 పబ్లిక్ CCTV కెమెరాలతో అనుసంధానించబడింది. అయోధ్యలోని ఎల్లో జోన్‌లో 10,715 AI ఆధారిత కెమెరాలు ఉంటాయి, ఇవి ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని కలిగి ఉన్నాయి, ఇవి ITMSతో అనుసంధానించబడి సెంట్రల్ కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షించబడతాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నగరంలో మోహరించాయి. ఇక అయోధ్య రైల్వే స్టేషన్లో జనవరి 27 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఆర్‌పీఎఫ్ పటిష్ట భద్రతను చేపట్టింది.