ఇండియాలో కరోనా మహమ్మారి భయం ప్రజలను పట్టి పీడిస్తోంది. కొద్దికాలంపాటు డెల్టా వేరియంట్ విజృంభించగా..ప్రస్తుతం ఒమిక్రాన్ భయపెడుతోంది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో మూడో వేవ్ వచ్చే ప్రమాదం ఉందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఐతే…కొత్త కేసులను అరికట్టేందుకు బూస్టర్ డోసులు ఇవ్వాలనే డిమాండ్ సైతం వినిపిస్తోంది. కొవిషీల్డ్‌ను బూస్టర్ డోసుగా ఇచ్చేందుకు అనుమతించాలని టీకా తయారీ సంస్థ సీరం…డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు కూడా చేసింది. దీనిపై ‘కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ’ ఆధ్వర్యంలోని బూస్టర్ డోసు ప్రయోగాల కమిటీ స్పందించింది. క్లినికల్ ట్రయల్స్ జరగకుండా బూస్టర్ డోసును సిఫార్సు చేయలేమని స్పష్టంచేసింది. బూస్టర్ డోస్ కోసం సీరమ్ చేసుకున్న దరఖాస్తును సమీక్షించింది. మరింత అదనపు సమాచారం కావాలని ఆ సంస్థను కోరింది.
ఇక…దేశంలో ఒమిక్రాన్ కేసులు వెలుగుచూస్తున్న వేళ కొవిషీల్డ్‌ను బూస్టర్ డోసుగా ఇచ్చేందుకు అనుమతించాలని సీరం ఇన్‌స్టిట్యూట్ డీసీజీఐకి ఈ నెల ప్రారంభంలో దరఖాస్తు చేసింది. ఆస్ట్రాజెనెకాను బ్రిటన్ ప్రభుత్వం బూస్టర్ డోసుగా గుర్తించిందని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు… కరోనాలో కొత్త ఉత్పరివర్తనాలు వస్తున్నందున బూస్టర్ డోసులు ఇవ్వాలన్న వినతులు వస్తున్నాయి. దేశంలో కొవిషీల్డ్ టీకాకు కొరత లేదని, తమ వినతిని పరిశీలించాలని ఆ సంస్థ కోరింది. చాలా దేశాల్లో ఇప్పటికే బూస్టర్ డోసులను ఇస్తున్నాయని గుర్తుచేసింది.