Anil Sunkara: అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో అనిల్ సుంకర నిర్మించిన చిత్రం ‘ఏజెంట్’. ఈ మూవీ ఇదే నెల 28న జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ముచ్చట్లను విలేకరులతో పంచుకున్నారు అనిల్ సుంకర. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడటం గురించి చెబుతూ, “గత నెల రోజులుగా రాత్రి, పగలు యూనిట్ అంతా పని చేస్తోంది. చాలా పెద్ద సినిమా ఇది. గంటన్నర సీజీ వర్క్ ఉంది. దాదాపు ప్రతి ఫ్రేంలో వుంటుంది. నిజాయితీగా చెప్పాలంటే ఈ సమయంలో కొంచెం ఒత్తిడి అయితే ఉంది. కానీ అది ఫలితం గురించి కాదు. ఆ విషయంలో ధీమాగా ఉన్నాం” అని అన్నారు.
ఈ సినిమా స్పాన్ గురించి తెలుపుతూ, “మా ‘ఏజెంట్’ భారీ స్పాన్ వున్న సినిమా. స్పై మూవీ అనగానే అవుట్ డోర్ షూటింగ్ ఉంటుంది. అన్నీ ఫారిన్ లొకేషన్స్ లోనే దీన్ని తీశాం. యాక్షన్స్ సీన్స్ కొరియోగ్రఫీ చేసిన తర్వాత, ఎడిటింగ్ చేసిన తర్వాత ఇలాంటి సినిమాల్లో మార్పులు వస్తే కష్టం. ఎంటర్ టైనర్స్, డ్రామా మూవీలలో చిన్న చిన్న తప్పులు వుంటే సర్దుకుపోవచ్చు. ‘ఏజెంట్’ లాంటి మూవీకి అది కుదరదు. అందుకే చాలా సమయం తీసుకుని చేశాం. ఇక ఈ సినిమా టైటిల్ విషయానికి వస్తే.. నేను ఐదేళ్ళ క్రితమే దీన్ని రిజిస్టర్ చేశాను. సురేందర్ రెడ్డి ఈ సినిమా కథ చెప్పి, టైటిల్ ‘ఏజెంట్’ అనగానే ఆ టైటిల్ మన దగ్గరే ఉందన్నాను. ఇది యాక్షన్ ఫిల్మ్. కథ భిన్నంగా వుంటుంది. ముగ్గురు ఏజెంట్స్ మధ్య జరిగే కథ. ఎమోషన్స్ కూడా బలంగా వుంటాయి. అఖిల్ కెరీర్ ను బిఫోర్ ‘ఏజెంట్’, ఆఫ్టర్ ‘ఏజెంట్’ గా భావించొచ్చు. గొప్ప థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే చిత్రమిది. దీన్ని కొందరు జేమ్స్ బాండ్ సినిమాలతో పోల్చుతున్నారు. అది నాకు ఆనందమే. ఆ స్థాయికి రీచ్ అయ్యామంటే మనం గెలిచినట్లే కదా! మేం సినిమాను ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ మా బడ్జెట్ పెరగడమే కాదు… మార్కెట్ కూడా పెరిగింది. అది ఖచ్చితంగా అడ్వాంటేజే. మార్కెట్ పెరుగుతోంది కాబట్టి ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ హిట్ కొడితే మనది మనకి వచ్చేస్తుందనే నమ్మకం వుంది” అని అన్నారు.
ఈ సినిమాను ఇప్పుడు తెలుగులోనే మాత్రమే విడుదల చేస్తున్నామని అనిల్ సుంకర తెలిపారు. దానికి కారణం వివరిస్తూ, “ఇది పాన్ ఇండియా కంటెంట్ ఉన్న సినిమా. అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. అయితే పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు కనీసం మూడు నెలలు సమయం వుండాలి. సో… మొదట తెలుగుపై ఫోకస్ చేసి సెకండ్ వీక్ నుంచి అటు వైపు ప్లాన్ చేసే ఆలోచన వుంది. ఇప్పటికే ఇతర భాషల్లో డబ్బింగ్ కార్యక్రమాలన్నీ పూర్తి చేశాం. ఇక ఓ బిజినెస్ మ్యాన్ గా ఆలోచిస్తే… ప్రతి సినిమానూ నేను అలానే చూస్తాను. బట్… చివరి నిమిషానికి మాత్రం సినిమా హిట్ కావాలని అనుకుంటాను. పది కోట్లు కావాలా? సూపర్ హిట్ కావాలా? అని ఏ నిర్మాతను అడిగినా… సినిమా సూపర్ హిట్ కావాలనే కోరుకుంటాడు. అలా అని హిట్ అయిన ప్రతి సినిమాకి డబ్బులు వస్తాయని కూడా చెప్పలేం” అని అన్నారు.
‘ఏజెంట్’ చిత్రం బిజినెస్ గురించి చెబుతూ, “నా వరకూ నేను చాలా హ్యాపీ. సినిమా మొదలుపెట్టినప్పుడే మేం పెద్ద సవాల్ ని తీసుకుంటున్నామనే క్లారిటీ వుంది. మేం ఒక లక్ష్యంతో వచ్చాం. దానిని రీచ్ అవుతామనే నమ్మకం ఉంది. ‘ఏజెంట్’ విడుదలైన తర్వాత అఖిల్ స్పాన్ డిఫరెంట్ గా వుంటుంది. ఈ సినిమా కోసం అతను ఎంతో రిస్క్ చేశాడు. ఇవాళ యంగ్ హీరోలు డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఒక నిర్మాతగా సేఫ్టీ చూసుకోమని యాక్షన్ కొరియోగ్రఫర్ కి చెప్తాను. మొన్న విజయవాడలో జరిగిన స్టంట్ కి మాత్రం వద్దు అని చెప్పాను. అదే హైదరాబాద్ లో అయితే మంచి యాక్షన్ మాస్టర్స్, భద్రత వుంటుందనేది నా ఆలోచన. అఖిల్ మాత్రం అక్కడే చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయంలో క్రెడిట్ అంతా అఖిల్ దే. ‘ఏజెంట్’ లో అలాంటి చాలా సాహసాలు ప్రేక్షకులు చూస్తారు” అని చెప్పారు. బేసికల్ గా తను ఫిల్మ్ ప్రొడ్యూసరే అయినా… దర్శకత్వం వహించాలనే కోరిక ఉందని, స్పై జోనర్ లో మూవీ చేస్తానని అనిల్ సుంకర తెలిపారు. అలానే చిరంజీవితో నిర్మిస్తున్న ‘భోళాశంకర్’ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతోందని, దాన్ని ముందు అనుకున్నట్టుగానే ఆగస్ట్ 11న విడుదల చేస్తామని స్పష్టం చేశారు.