రచయిత డైమండ్ రత్నబాబు దర్శకుడుగా తీసిన ముందు రెండు సినిమాలు డిజాస్టర్స్ గా నిలిచాయి. అవే ‘బుర్రకథ, సన్ ఆఫ్ ఇండియా’. తాజాగా తన మూడో సినిమా ‘అన్ స్టాపబుల్’ పోస్టర్ ను వినాయకచవితి కానుకగా విడుదల చేశాడు. ‘బాహుబలి’ సినిమాపై రత్నబాబు చేసిన కామెంట్ అతగాడి గురించి అందరిలో చర్చ జరిగేలా చేసింది. ‘బాహుబలి’ వంటి సూపర్ హిట్ సినిమా దర్శకుడు రాజమౌళి అని అందరికీ తెలుసు… కానీ ఆ సినిమా రచయితల పేర్లు ఎవరికీ తెలియవు’ అని రత్నబాబు చేసిన కామెంట్ అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దర్శకుల నీడలో రచయితలు ఎదగటం లేదనే అతని భావనగా అందరూ భావించారు.
అందుకే అతడు దర్శకుడుగా తన మార్కు చూపిస్తాడని ఆశించారు. అయితే రాయటం సులభమే కానీ తీయటం కష్టం అని తను దర్శకత్వం వహించిన సినిమాల ద్వారా నిరూపించాడు రత్నబాబు. దర్శకుడిగా అతని తొలి చిత్రం ‘బుర్రకథ’ ఘోర పరాజయం పాలైనప్పటికీ, రెండో సినిమాగా మోహన్ బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’తో అయినా హిట్ కొడతాడనుకుంటే అంది తొలి సినిమాను మించిన పరాజయాన్ని మూటకట్టుకుంది. వినాయక చవితి సందర్భంగా డైమండ్ రత్నబాబు మూడో సినిమా ‘అన్‌స్టాపబుల్’ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో బిగ్ బాస్ విజేత సన్ని, సప్తగిరి ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటి వరకూ బిగ్ బాస్ విజేతలు చేసిన సినిమాలు కూడా అంత ప్రభావం చూపించలేక పోయాయి. ఈ నేపథ్యంలో రత్నబాబు తన మూడో సినిమాతో ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి.