సినిమాలో ఉన్న పాటలు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సహా ఒకే సంగీత దర్శకుడు కంపోజ్ చేయటం అన్నది అనాదిగా మన ఫిలిమ్ మేకర్స్ అనుసరస్తున్న విధానం. అప్పుడప్పుడు ఒకటి రెండు పాటలు వేరే సంగీత దర్శకుడితో చేయించినా నూటికి 99 శాతం మాత్రం ఒకే సంగీత దర్శకుడితో ప్రయాణం చేయటం మన దర్శకనిర్మాతలకు అలవాటైన విషయం. అయితే ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. ప్రముఖ బాలీవుడ్ ఆడియో కంపెనీ టీసీరీస్ తాము నిర్మిస్తున్న సినిమాలలో పాటలను పలువురు సంగీత దర్శకులతో కంపోజ్ చేయిస్తున్నారు. ఇలా ఒక్కో పాటకు ఒక్కో స్వరకర్తతోను, నేపథ్య సంగీతాన్ని మరొకరితో చేయించే ఫార్ములా బాలీవుడ్ లో కొంత వరకూ వర్కవుట్ అవుతోంది. ఇది టీసిరీస్ వారి ఫార్ములా.
టీసీరీస్ అలా ప్రభాస్ నటించిన ‘సాహో’ కోసం తనిష్క్ బాగ్చి, గురు రంధావా, బాద్షా, శంకర్ ఎషాన్ లాయ్ తో పాటలను కంపోజ్ చేయించి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను జిబ్రాన్ తో చేయించారు. ఈ సినిమాలో ‘సైకో సైయాన్’, ‘ఏ చోట నువ్వున్నా’, ‘బ్యాడ్ బోయ్’ పాటలు మంచి హిట్ అయ్యాయి. ఇప్పుడు ‘రాధే శ్యామ్’ కోసం కూడా అదే ఫార్ములా అప్లై చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో జస్టిన్ ప్రభాకరన్ కంపోజ్ చేసిన ‘ఈ రాతలే’ అనే పాట ఒక వర్గాన్ని ఆకట్టుకోగా, ఇప్పుడు మిథున్ కంపోజ్ చేసిన ‘ఆషికి ఆహ్ గయీ’ అనే హిందీ పాట టీజర్ తోనే సంచలనం సృష్టిస్తోంది. మిగిలిన పాటలు కూడా అమాల్ మాలిక్, మనన్ భరద్వాజ్ కంపోజ్ చేస్తున్నారు. అవి కూడా చార్ట్బస్టర్లుగా నిలుస్తాయంటున్నారు. ఇక తెలుగులో నేపథ్య సంగీతాన్ని జస్టిన్ ప్రభాకరన్, హిందీలో సంచిత్ బల్హారా అందించనున్నారు. టాలీవుడ్ టాప్ కంపోజర్స్ అయిన దేవీశ్రీప్రసాద్, థమన్ వంటి వారు ఈ ఫార్ములాకు నో చెబుతున్నారు. బాలీవుడ్ లో మాత్రం టాప్ కంపోజర్లు సైతం ఈ ఆలోచనను స్వాగతిస్తున్నారు.
ఇంతకీ ఈ ఫార్కులా కరెక్టా? కాదా? అంటే మిశ్రమ స్పందన లభిస్తోంది. ఒక సినిమాలోని పాటలను వేరు వేరు సంగీత దర్శకులతో చేయించటం ద్వారా లాభం ఉంది. నష్టమూ ఉంది. కంపోజర్ కి సందర్భం చెప్పి ట్యూన్ తీసుకోవడంతో పాటు ఇతర పాటలను వేరే సంగీత దర్శకులు చేస్తారని తెలియటం వల్ల పోటీ తత్వం ఏర్పడి మంచి ట్యూన్ రావటానికి వీలుంది. అదే టైమ్ లో టొటాలిటీ మిస్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఒకే సంగీత దర్శకుడు ఉండటం వల్ల యూనిట్ తో ట్రావెల్ అవుతూ కథలో సారాన్ని గ్రహించి సందర్భానుగుణంగా మంచి ట్యూన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక నేపథ్య సంగీతం ఎలాగూ సినిమా మొత్తం చూసి తదనుగుణంగా కంపోజ్ చేస్తారు కాబట్టి ఈ విషయంలో ఎలాంటి కన్ఫూజన్ ఉండదు. సో పాటలకు ఒకరు, నేపథ్యసంగీతానికి ఇంకొకరు పని చేస్తే ఎలాంటి డిస్ట్రబెన్స్ ఉండదన్నది సంగీత పరిజ్ఞానం ఉన్న వారు చెబుతున్న మాట. అయితే టీసీరీస్ వారు తమ ఫార్ములాతో సక్సెస్ సాధించినన్ని రోజులూ దీనికి ఎలాంటి ఢోకా ఉండదు. ఫెయిల్యూర్స్ ఎదురైతే మాత్రం విమర్శలు ఎదుర్కోక తప్పదు. మరి టీసీరీస్ ఫార్ములాను తెలుగులో ఎవరు అమలు చేస్తారో చూద్దాం.