‘ఖిలాడి’తో మరో డిజాస్టర్ ప్లాప్ ఇచ్చిన రవితేజ శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ’తో మరోమారు ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. దీంతో ఖచ్చితంగా హిట్ కొడతాడనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. ఈ సినిమా ఏప్రిల్ లో రాబోతున్నట్లు ఇప్పటికే యూనిట్ ప్రకటించింది. అంతే కాదు నాన్ థియేట్రికల్ బిజినెస్ ను క్లోజ్ చేసే పనిలో పడింది. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ సోనీ లివ్ ఓటీటీకి ఇచ్చినట్లు యూనిట్ చెబుతోంది.
తెలుగులో స్ట్రీమింగ్ ఆరంభంచిన సోనీ లివ్ కి ఇప్పటి వరకూ చెప్పుకోదగ్గ హిట్ లేదు. తెలుగులో ఖాతాదారులు కూడా అంతంత మాత్రమే. ఇప్పటి వరకూ ఈ ఓటీటీలో ‘స్కైలాబ్, గేమ్, ఎనిమీ, డబ్యూడబ్యూడబ్యూ, ఫ్యామిలీ డ్రామా, వివాహభోజనంబు, ఆకాశవాణి, చెక్’ వంటి సినిమాలు స్ట్రీమింగ్ అయ్యాయి. వీటిలో ప్రజాదరణ పొందిన సినిమా ఒక్కటీ లేదు. అందుకేనేమో రవితేజ అభిమానులు ఈ విషయమై అసంతృప్తితో ఉన్నారు.
‘అమెజాన్, ఆహా, హాట్ స్టార్’ వంటి పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఉండగా సోనీకే ఎందుకని భావిస్తున్నారు. ఇందులో స్ట్రీమింగ్ అయితే తమ హీరో సినిమాను ఎంత మంది చూస్తారన్నది వారి అనుమానం. ఇక సోనీ లివ్ మాత్రం ఈ సినిమాతోనైనా తమ ఖాతాదారుల సంఖ్య పెరుగుతుందనే ఆశతో ఉంది. థియేటర్ రిలీజ్ తర్వాత ఏ ఓటీటీ లో స్ట్రీమింగ్ అయినా ఏముంది అనే వారు లేకపోలేదు. ఎందుకంటే సినిమా హిట్ అయితే ఎక్కడ స్ట్రీమింగ్ అయినా చూస్తారు. ప్లాప్ అయితే ఎక్కడా చూడరు అన్నది వారి లాజిక్ పాయింట్. అందులో కొంత వరకూ నిజం ఉన్నా ఇప్పటికే ఇయర్లీ సబ్ స్ర్కిప్షన్ తీసుకుని ఉన్న ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ని కాదని ఒక సినిమా కోసం కొత్తగా సోనీలివ్ కి వస్తారా!? అన్నది మేజర్ డౌట్. తన పారితోషికం తప్ప రవితేజ ఇలాంటివి పట్టించుకోడు కాబట్టి ఆయన అభిమానులు ఆందోళన పడటంలో ఎలాంటి తప్పు లేదు. ఏమంటారు!?