ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. దక్షిణాదిన ఒక్కరోజు తేడాలో రెడు బడా స్టార్స్ సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా ఆడియన్స్ తీర్పుకోరాయి. అందులో మొదటిది విజయ్ నటించిన ‘బీస్ట్’. ఇది బుధవారం అనగా ఏప్రిల్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. అయితే ఈ సినిమా మీద విజయ్ అభిమానులతో పాటు ప్రేక్షకులు పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయి. ‘బీస్ట్’ ఆడియన్స్ ను ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయింది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ హ్యాట్రిక్ ఆశలు కూడా వమ్మయ్యాయి. కాజాలా ఆకట్టుకుంటూ వస్తున్న పూజ సైతం చేతులెత్తేసింది. దీంతో ఇప్పుడు అందరి కళ్ళూ గురువారం రానున్న ‘కెజిఎఫ్2’మీదే ఉన్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లో కొన్ని చోట్ల ‘ఆర్ఆర్ఆర్’ని సైతం వెనక్కి నెట్టేసిన ‘కెజిఎఫ్2’ పూర్తి స్థాయి యాక్షన్ సినిమా.
తొలిభాగం ఘన విజయంతో పాటు స్టార్ కాస్టింగ్, ట్రైలర్ కి దక్కిన ఆదరణ ఈ సినిమా హైప్ ని మరింత పెంచాయని చెప్పాలి. దానికి తోడు విజయ్ ‘బీస్ట్’ పరాజయం యశ్ ‘కెజిఎప్2’కి మరింత ఆడ్వాంటేజ్ అవుతుందని పలువురు భావిస్తున్నారు. అయితే సినిమాలో విషయం లేకుండా ఒక్క హీరోయిజం, మాస్ యాక్షన్ ని ఎలివేట్ చేస్తే మాత్రం భంగపడక తప్పదు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడనేది చూడాల్సి ఉంది. మరి ‘బీస్ట్’ పరాజయం ‘కెజిఎఫ్2’కి ఆడ్వాంటేజ్ అవుతుందా? లేక ‘కెజిఎఫ్2’ కూడా ‘బీస్ట్’ బాటలో పయనిస్తుందా? అన్నది మరి కొన్ని గంటల్లోనే తేలనుంది. సినిమా ఇండస్ట్రీ మరింత ఊపు రావాలంటే మాత్రం విజయం సాధించక తప్పని పరిస్థితి. చూడాలి ఏం జరుగుతుందో!?