‘ద బ్యాట్ మేన్’ సినిమా మార్చి 4న జనం ముందు వాలగానే, ‘బ్యాట్ మేన్’ లవర్స్ మదిలో గబ్బిలం మనిషి పాత చిత్రాల తలంపులు మెదిలాయి. గతంలో హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ తెరకెక్కించిన ‘బ్యాట్ మేన్ ట్రయాలజీ’ని తలచుకున్నారు ‘బ్యాట్ మేన్’ ఫ్యాన్స్. నోలాన్ తెరకెక్కించిన ‘బ్యాట్ మేన్ బిగిన్స్’ (2005), ‘ద డార్క్ నైట్’ (2008), ‘ద డార్క్ నైట్ రైజెస్’ (2012) చిత్రాలు ఒకదానిని మించి ఒకటి విజయం సాధించాయి. ఈ చిత్రాలన్నీ బ్యాట్ మేన్ స్ఫూర్తితో తెరకెక్కినవే. కానీ, ఇందులోని కథాంశాలన్నీ బ్యాట్ మేన్ ను మరింతగా కొత్తగా చూపించే ప్రయత్నం చేశాయి. వీటిలో ‘ద డార్క్ నైట్’లో విలన్ గా ‘జోకర్’ పాత్రను ప్రవేశ పెట్టారు.
హీత్ లెడ్జర్ పోషించిన ఆ పాత్ర విశేషాదరణ పొందింది. ఆ పాత్ర స్ఫూర్తితో 2019లో ‘జోకర్’ అనే సినిమా రూపొంది 11 ఆస్కార్ నామినేషన్స్ సంపాదించింది. అందులో ‘జోకర్’గా నటించిన జోక్విన్ ఫీనిక్స్ బెస్ట్ యాక్టర్ గా అకాడమీ అవార్డునూ సొంతం చేసుకోవడం విశేషం! ఇలా పలు అంశాలు బ్యాట్ మేన్ కారణంగా సినీజనం మదిలో మెదలుతున్నాయి. వాటిలో భాగంగానే ఇప్పటి దాకా ‘బ్యాట్ మేన్’ పాత్ర పోషించిన వారిలో ఎవరు బెస్ట్ అనే అంశంపై ఓ సర్వే నిర్వహించారు. ఇందులో 2, 92, 254 ఓట్లు పోలయ్యాయి. ఈ పోల్ నేపథ్యంలో ఇప్పటి దాకా బుల్లితెరపైనా, బిగ్ స్క్రీన్ పైనా బ్యాట్ మేన్ గా అలరించిన వారిని గుర్తు చేసుకోవలసిందే! లూయిస్ జి. విల్సన్ – బ్యాట్ మేన్ గా నటించిన తొలి నటుడు – 1943లో రూపొందిన ‘బ్యాట్ మేన్’ టెలివిజన్ సీరిస్ లో నటించాడు. ఇప్పటి దాకా అతి పిన్నవయసులో బ్యాట్ మేన్ పాత్ర పోషించిన నటునిగా నిలిచాడు.
అప్పట్లో విల్సన్ వయసు కేవలం 23 ఏళ్ళే!
1949లో రూపొందిన టెలివిజన్ సీరిస్ ‘బ్యాట్ మేన్ అండ్ రాబిన్’లో రాబర్ట్ లోవెరీ బ్యాట్ మేన్ పాత్ర పోషించాడు. తరువాత ఆడమ్ వెస్ట్ 1960లలో రూపొందిన ‘బ్యాట్ మేన్’ సీరిస్ లో నటించాడు. మైఖేల్ కీటన్ 1989లో రూపొందిన బ్యాట్ మేన్ సీరిస్ లో అలరించాడు. బ్యాట్ మేన్ కేరెక్టర్ కు తెరపై ఓ స్పెషల్ క్రేజ్ సంపాదించిన నటుడిగా కీటన్ నిలచిపోయారు.
వాల్ కిల్మర్ 1995లో తెరకెక్కిన ‘బ్యాట్ మేన్ ఫరెవర్’లో నటించాడు. ఈయన ద్విపాత్రాభినయం కూడా చేయడం విశేషం! జార్జి క్లూనీ 1997లో రూపొందిన ‘బ్యాట్ మేన్ అండ్ రాబిన్’లో బ్యాట్ మేన్ గా నటించాడు. తరువాత క్లూనీ తాను బ్యాట్ మేన్ గా న్యాయం చేయలేకపోయానని నిజాయితీగా అంగీకరించారు. క్రిస్టోఫర్ నోలాన్ తెరకెక్కించిన ‘బ్యాట్ మేన్’ సీరిస్ లో మూడు సార్లు బ్యాట్ మేన్ గా కనిపించాడు క్రిస్టియన్ బేల్. తరువాత బెన్ అఫ్లెక్ 2016లో రూపొందిన ‘బ్యాట్ మేన్ వర్సెస్ సూపర్ మేన్: డాన్ ఆఫ్ జస్టిస్’లోనూ, 2017లో తెరకెక్కిన ‘జస్టిస్ లీగ్’లోనూ బ్యాట్ మేన్ గా నటించాడు. తాజాగా ‘ద బ్యాట్ మేన్’లో రాబర్ట్ ప్యాటిన్సన్ గబ్బిలం మనిషిగా అలరిస్తున్నాడు.
వీరందరిలో బెస్ట్ ఎవరు అన్న అంశంపై నిర్వహించిన పోటీలో 66 శాతం ఓట్లతో క్రిస్టియన్ బేల్ ప్రథమ స్థానం ఆక్రమించారు. తరువాతి స్థానంలో నిలచిన బెన్ అఫ్లెక్ కు 13 శాతం ఓట్లు, మూడో స్థానం దక్కించుకున్న మైఖేల్ కీటన్ కు 12 శాతం ఓట్లు, చివరి స్థానంలో 9 శాతం ఓట్లతో ఆడమ్ వెస్ట్ ఉన్నారు. తాజా బ్యాట్ మేన్ సీరిస్ లో రాబర్ట్ ప్యాటిన్సన్ నటించబోతున్నాడు. అందువల్ల ఈ సారి ఈ జాబితాలో అతనికీ చోటు దక్కుతుందో, లేదా అందరినీ మించి ఎక్కువ మందిని ఆకట్టుకుంటాడో చూడాలి.