మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్లానింగ్ గురించి తెలియని వారు లేరు. ఆయన ప్లాన్ వేస్తే ఇక తిరుగుండదు. చిరంజీవిని మెగాస్టార్ కావటం వెనుక అరవింద్ బుర్రకే అగ్రతాంబూలం ఇవ్వాలి. ఇక కాలానికంటే ముందు పరిగెత్తే బుర్ర అరవింద్ ది. సినిమాలు, రిలీజ్ లు, సక్సెస్ లు ఆ బుర్ర నుంచి కుప్పలు తెప్పలు గా వచ్చాయి. తాజాగా ఆయన బ్రెయిన్ నుంచి వచ్చిన ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ తెలుగునాట అగ్రస్థానంలో నిలవటంలో ఆయన చిన్ని బుర్ర పాదరసంలా పని చేసిందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఇటీవల కాలంలో చిరు ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి దూరం పెరిగిందనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే వాటిని ఓ పరిధి దాటి ఎదగనీయకుండా రెండు ఫ్యామిలీల మధ్య అనుసంధాన కర్తగా వ్యవహరిస్తూ మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే అనిపించేలా చేయటంలో అరవింద్ మాస్టర్ బ్రెయిన్ ని మెచ్చుకోవలసిందే. ఇక కాలంతో పరుగెడుతూ ఆహాని అందరి చెంతకు చేర్చటంలో ఆరవింద్ ఎత్తుగడలు ఎంతగానో పని చేశాయి. అందులో భాగంగా ఇటీవల బాలయ్యతో ‘అన్ స్టాపబుల్’ షో చేయించటం అయితే అరవింద్ ప్లానింగ్ కి పరాకాష్ట. ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్లు ఇటు ఎన్టీఆర్ ఫ్యామిలీకి దగ్గర కావడంతో పాటు అటు నందమూరి వంశాభమానుల ఆదరణ పొందటం ఈ ఎత్తుగడ వెనుక ఉన్న అసలు ఉద్దేశం. అది చాలా వరకూ నెరవేరింది కూడా. బాలయ్య అన్ స్టాపబుల్ సక్సెస్ కావటం అరవింద్ పని చాలా సులభతరం అయింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ బాలయ్య ‘అఖండ’కు బన్నీ ముఖ్య అతిథిగా హాజరు కావటం. బాలకృష్ణ అరవింద్ ‘ఆహా’లో టాక్ షో చేయటమే పెద్ద వింత అనుకుంటే ఇప్పుడు బాలయ్య ‘అఖండ’కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా పాల్గొననుండటం మరో విశేషం. ఇది ఓ విధంగా నందమూరి మెగా అభిమానులకు సంతోషాన్ని కలిగించే అంశమే. గతంలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ప్రారంభోత్సవానికి చిరంజీవి అతిథిగా హాజరైన తర్వాత నందమూరి, మెగా అభిమానులను ఊరించే ట్రీట్ ఇది. ఇక్కడ బాలకృష్ణ మనస్తత్వం గురించే ఎక్కువగా చెప్పుకోవాలి. బాలయ్యది కల్మషం లేని మనసు. మైండ్ లో ఏది ఉంటే అది ఓపెన్ గా మాట్లాడేస్తుంటారు. అంతే ఓపెన్ గా ఆరవింద్ ప్రపోజల్ కి ఓకె చెప్పేశాడు. ఇప్పుడు ‘అఖండ’ ఈవెంట్ కి తన కన్నా చిన్నవాడైన అల్లు అర్జున్ ముఖ్య అతిథి అన్నా కూడా వెంటనే ఓకే చెప్పేశాడు. ఇది బాలకృష్ణ ఓపెన్ మైండ్ కి నిదర్శనం.
అరవింద్ ‘ఆహా’ని నిలబెట్టడంతో పాటు ఎంతో ముందుచూపుతో ఇప్పటికే స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగిన అల్లు అర్జున్ కెరీర్ కి కూడా ఎలాంటి ఢోకా లేకుండా చూసుకుంటున్నారు. చిరంజీవి ఫ్యామిలీకి బన్నీకి దూరం పెరిగిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇది ఎంతో ముఖ్యం కూడా. ఇప్పటికే ఆహాకి ముఖచిత్రంగా మారాడు బన్నీ. ఆహాలో స్ట్రీమింగ్ కాబోయే సినిమాల వేడుకలకు కూడా అతిథిగా హాజరవుతున్నాడు. తను ఐకాన్ స్టార్ నే కాదు ఫ్రెండ్లీ స్టార్ ని అని చాటుతున్నాడు. ఈ స్ట్రాటజీ అల్లు ఫ్యామిలీకి ఏ మేరకు కలసి వస్తుందనేని కాలమే చెప్పాలి.