What did Varun and Janhvi Kapoor do in Poland?
యంగ్ హీరో వరుణ్ ధవన్ ఎక్కడ ఉంటే అక్కడ హంగామా ఉంటుందని బాలీవుడ్ లో ప్రతీతి. నాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తో కలసి వరుణ్ ధవన్ నటిస్తోన్న ‘బవాల్’ సినిమా షూటింగ్ పూర్తయింది. పోలాండ్ లోని వార్సాలో ఈ సినిమా షూటింగ్ కు కొబ్బరి కాయ కొట్టారు. అసలే టైటిల్ ‘బవాల్’. అంటేనే హంగామా చేయడం అని అర్థం. ఇక వరుణ్ ధవన్ ఊరకే ఉంటాడా? తమ సినిమా షూటింగ్ పూర్తయిందని, లాస్ట్ టేక్ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సందడి చేశాడు. అసలే జాన్వీ కపూర్ హిట్ చూడక చాలా రోజులయింది. ఆమె ఆశలు పెట్టుకున్న ‘గుడ్ లక్ జెర్రీ’ బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అంది. ఇక ఎంతగానో మెచ్చి, నచ్చి నటించిన ‘మిలి’ షూటింగ్ పూర్తి చేసుకున్నా ఇంకా విడుదలకు నోచుకోలేదు. రాజ్ కుమార్ రావ్ తో కలసి జాన్వీ నటిస్తోన్న ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ షూటింగ్ దశలోనే ఉంది. అందువల్ల జాన్వీ ఆశలన్నీ ‘బవాల్’పైనే ఉన్నాయి. యంగ్ అండ్ ఎనర్జిటిక్ వరుణ్ ధవన్ తో జోడీ కట్టడం వల్ల జాన్వీ కూడా భలే హుషారుగా ఈ సినిమాలో నటించిందని డైరెక్టర్ నితేశ్ తివారి అంటున్నాడు.
‘బవాల్’ చిత్రాన్ని సాజిద్ నడియడ్వాలా నిర్మిస్తున్నాడు. ‘బవాల్’ చిత్రం వచ్చే సంవత్సరం ఏప్రిల్ లో జనం ముందుకు రానుంది. “హమ్ నే మచా దియా హై…” అంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు వరుణ్. ‘బవాల్’ షూటింగ్ లో తాము చెలరేగిపోయామని, దీనిని ‘అజ్జు భయ్’ స్టైల్ లో పూర్తి చేశామని పేర్కొన్నాడు. వచ్చే ఏప్రిల్ లో థియేటర్లలో నిజంగానే ‘బవాల్’ (సందడి) ఉంటుందనీ ట్వీట్ చేశాడు. మరి అతను అన్నట్టుగా ‘బవాల్’ మరో తొమ్మిది నెలల సమయానికి థియేటర్లలో హంగామా చేస్తుందా? శ్రీదేవి కూతురు జాన్వీ కోరుకుంటున్న అసలు సిసలు సక్సెస్ ను అందిస్తుందా? చూద్దాం ఏమవుతుందో!