NTR-ANR: మహానటులు నటరత్న యన్టీఆర్, నటసమ్రాట్ ఏయన్నార్ ఇద్దరూ అన్నదమ్ముల్లా మెలిగారు. ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఆ తరువాత కొన్ని విషయాల్లో మనస్పర్థలు వచ్చాయి. కొంతకాలం వారి మధ్య మాట కూడా కరువయింది. అయినా ఏనాడూ వారు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నది లేదు.అయినా, ఒకరి ఇంట్లో విశేషానికి మరొకరు తప్పకుండా హాజరయ్యేవారు. అలాంటి అనుబంధం వారిది. 1975లో ఏయన్నార్ అనారోగ్యం పాలయినప్పుడు మళ్ళీ వారి మధ్య అన్నదమ్ముల అనుబంధం బలపడింది. ఆ సమయంలోనే యన్టీఆర్ తాను ‘దానవీరశూర కర్ణ’ సినిమా తీయాలను కుంటున్నారు. అందులో వెరైటీగా ఏయన్నార్ తో శ్రీకృష్ణుని పాత్ర ధరింప చేయాలని భావించారు. కానీ, అప్పటికే యన్టీఆర్ అపర శ్రీకృష్ణునిగా జనం మదిలో నిలిచారు. అందువల్ల ఏయన్నార్ శ్రీకృష్ణునిగా తాను తగనని సున్నితంగా తిరస్కరించారు.
Kabzaa 2: యో.. అప్పుడే పార్ట్ 2 ఏంటయ్యా.. ?
దాంతో యన్టీఆర్ తన వద్ద రెండు స్క్రిప్టులు సిద్ధంగా ఉన్నాయని, వాటిలో నచ్చిన దానిలో నటించమని ఏయన్నార్ ను కోరారు. అందుకు ఏయన్నార్ ‘చాణక్య-చంద్రగుప్త’ స్క్రిప్ట్ నచ్చి, అందులో చాణక్యుని పాత్ర పోషిస్తానని అంగీకరించారు. యన్టీఆర్ చంద్రగుప్తునిగా నటించి, స్వీయదర్శకత్వంలో రామకృష్ణా సినీస్టూడియోస్ పతాకంపై ఆ చిత్రాన్ని నిర్మించారు. అప్పుడే తమ అన్నపూర్ణ సినీస్టూడియోస్ చిత్రంలోనూ యన్టీఆర్ ను నటించవలసిందిగా ఏయన్నార్ అడిగారు. అందుకు యన్టీఆర్ “ఒకే బ్రదర్… మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు డేట్స్ అడ్జస్ట్ చేస్తాను” అని చెప్పారు. అదే సమయంలో ఏయన్నార్ తో సినిమా తీయాలని జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత వి.బి.రాజేంద్రప్రసాద్ ఉన్నారు. ఆ సమయంలో తన మిత్రుడు రాజేంద్రప్రసాద్ కు మంచి లాభాలు రావాలన్న అభిలాషతో ఏయన్నార్ ఓ ఆలోచన చేశారు. తన చిత్రంలో యన్టీఆర్ నటిస్తానని మాటిచ్చారు కాబట్టి, ఆయన కాల్ షీట్స్ నేను తెస్తాను. మా ఇద్దరితో కలసి ఓ మల్టీస్టారర్ తీస్తే, నీకు మంచి లాభాలు వస్తాయని ఏయన్నార్ , రాజేంద్రప్రసాద్ కు సలహా ఇచ్చారు. ఆయన సరే అన్నారు. యన్టీఆర్ తనకు ఇచ్చిన డేట్స్ నే తన పెట్టుబడిగా పెట్టి, ఏయన్నార్ – జగపతి అధినేత వి.బి.రాజేంద్ర ప్రసాద్ తో కలసి ‘రామకృష్ణులు’ అనే చిత్రం తీశారు. అందుకే ఈ సినిమాను అన్నపూర్ణ సినీస్టూడియోస్ అండ్ జగపతి ఆర్ట్ పిక్చర్స్ కలసి నిర్మించినట్టుగానే ప్రకటించారు. అలా ఆ రోజుల్లో ఏయన్నార్ కంటే దాదాపు ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉన్న యన్టీఆర్ కాల్ షీట్ విలువతో ఏయన్నార్ ‘రామకృష్ణులు’లో భాగస్వామి అయి మంచి లాభాలు ఆర్జించారు. ‘రామకృష్ణులు’ చిత్రం 1978 టాప్ గ్రాసర్ గా నిలచింది.