చిత్రపరిశ్రమను చిరకాలంగా వేధిస్తున్న సమస్యలలో పైరసీ ఒకటి. గతంలో సినిమాలు నెలలు, వందల రోజులు ఆడేవి. అయితే పైరసీ భూతం ఎంటరైన తర్వాత కాలక్రమేణా సినిమా రన్ పడిపోయింది. విడుదలైన గంటల్లోనే పైరసీ రూపంలో సినిమాలు లభ్యం అవుతుండటంతో శతదినోత్సవ చిత్రాలే కరువయ్యాయి. ఇక ఇప్పుడు పట్టుమన నెల రోజులు ఆడే సినిమా కూడా కనిపించటం లేదు. అన్నీ వీకెండ్ సినిమాలుగా మారిపోయాయి. కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్లు సినిమా మనుగడకు ప్రశ్నార్థకంగా మారిన సమస్యలో ప్రధానమైన సమస్య ఈ పైరసీ. ఇక దక్షిణాది సినిమాకు అతి పెద్ద గండంగా పరిణమించింది తమిళ్ రాకర్స్.
దర్శకనిర్మాతలు ఎంతో శ్రమించి లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి ఈ పైరసీని అడ్డుకోవాలని చూసినా అంతకు మించి ఆధునిక సాంకేతికను వాడుతూ పైరసీ ప్రింట్లను తీసుకు వస్తున్నారు తమిళ రాకర్స్. రిలీజ్ అయిన ప్రతి సినిమాను పైరసీ చేస్తూ ఆన్ లైన్ లో పెట్టేస్తున్నారు ఈ తమిళ్ రాకర్స్. సవాల్ చేసి మరీ పైరసీ చేసి తలనొప్పిగా మారారు. వీరి నెట్ వర్క్ ప్రపంచం అంతటా విస్తరించి ఉంది. ఇప్పుడు ఈ తమిళ రాకర్స్ పై ఓ వెబ్ సిరీస్ రానుంది. తమిళ్ రాకర్స్ వల్ల నిర్మాతలు ఎదుర్కొన్న కష్టాలను ఈ వెబ్ సీరీస్ లో చూపించబోతున్నారు. దీనికి ప్రముఖ దర్శకుడు శంకర్ శిష్యుడు అరివళగన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
తమిళ స్టార్ అరుణ్ విజయ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. వీరిద్దరి కలయికలో ‘కుట్రమ్ 23, బోర్డర్’ సినిమాలు రూపొందాయి. ఈ వెబ్ సీరీస్ కూడా సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. తమిళ్ రాకర్స్ పేరుతో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ టైటిల్ ఎనౌన్స్ మెంట్ తోనే ఆసక్తిని కలిగించింది. మరి తమిళ్ రాకర్స్ లో అంశం ఏమిటి? సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కాబోయే ఈ ‘తమిళ్ రాకర్స్’ గురించి ఏ ఏ సీక్రేట్స్ వెల్లడి కాబోతున్నాయనేది చూడాలి.