పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దుకోనున్న చిత్రం బుధవారం ముహూర్తం జరుపుకుంది. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఆత్మీయ అతిథుల నడుమ వైభవంగా ప్రారంభం అయింది. సుప్రసిద్ధ దర్శకు డు త్రివిక్రమ్, హీరో సాయి ధర్మ తేజ్, హారిక అండ్ హాసిని సంస్థ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు), దర్శకుడు సుధీర్ వర్మ, మరో దర్శకుడు కళ్యాణ్ (‘అనగనగా ఒక రాజు’) చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. ముహూర్తపు దృశ్యానికి దర్శకత్వం త్రివిక్రమ్ వహించారు. హీరో సాయి ధర్మ తేజ్ క్లాప్ ఇవ్వగా, దర్శకుడు సుధీర్ వర్మ కెమెరా స్విచాన్ చేశారు. స్క్రిప్ట్ ను నిర్మాత ఎస్. నాగవంశీ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ కు అందించారు.
తొలిచిత్రం ‘ఉప్పెన’తోనే స్టార్ గా ప్రేక్షక హృదయాలలో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న వైష్ణవ్ తేజ్ సరికొత్త మాస్ అవతారంలో ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. శ్రీలీల హీరోయిన్ కాగా, దర్శకుడుగా శ్రీకాంత్ ఎన్. రెడ్డి పరిచయం అవుతున్నారు. పూరి స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుందని దర్శక, నిర్మాతలు చెబుతున్నారు. సినిమా రెగ్యులర్ షూటింగ్, అలాగే చిత్రానికి సంబంధించిన ఇతర నటీ నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. పి. డి. వి. ప్రసాద్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు.