కొన్ని జంటలను చూడగానే కనులకు విందుగా ఉంటుంది. ‘మహానటి’ సినిమా చూసిన వారికి అందులో టైటిల్ రోల్ పోషించిన కీర్తి సురేశ్ తరువాత చప్పున గుర్తుకు వచ్చేది సమంతనే! అందులో జర్నలిస్టు మధురవాణిగా సమంత అభినయం భలేగా ఆకట్టుకుంది. అలాగే ఆమెకు జోడీగా విజయ్ ఆంటోనీ పాత్రలో విజయ్ దేవరకొండ నటించారు. ఆ చిత్రంలో సమంత, విజయ్ కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉంటుంది. ఈ జంట మరోమారు ప్రేక్షకులను పలకరించబోతోంది. యస్… సమంతతో విజయ్ దేవరకొండ మరోసారి జోడీగా నటించబోతున్నారు.
“నిన్నుకోరి, మజిలీ, టక్ జగదీశ్” వంటి చిత్రాలను తెరకెక్కించిన శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రంలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ 21న మొదలు కానుంది. రెగ్యులర్ షూటింగ్ కశ్మీర్ లో జరగనుంది. శివ నిర్వాణ చిత్రాలను పరిశీలిస్తే, సెన్సిటివ్ లవ్ స్టోరీస్ ను ఆయన రూపొందించిన తీరు గుర్తుకు వస్తుంది. ‘మజిలీ’ చిత్రంలో ఇంతకు ముందు శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత నాయికగా నటించారు. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. విజయ్ దేవరకొండతో శివ నిర్వాణకు ఇది తొలి చిత్రం. ఈ సారి కూడా ఓ వైవిధ్యమైన ప్రేమకథతోనే శివ నిర్వాణ వస్తున్నారు. ఈ ప్రేమకథలో విజయ్ దేవరకొండ, సమంత జోడీ ఏ తీరున మురిపించనుందో చూడాలి