Victoria No 203 Completes 50 Years: హిందీ చిత్రసీమలో మల్టీస్టారర్స్ కు కొదువే లేదు. ఏ భేషజాలూ లేకుండా మహానటులు ఎంతో అన్యోన్యంగా, ఆనందంగా కలసి నటిస్తూ ఉంటారు. ఆ సంప్రదాయం ఈ నాటికీ బాలీవుడ్ లో కొనసాగుతోంది. హిందీ సినిమా రంగంలో తొలి తరం స్టార్ హీరోస్ లో ఒకరైన అశోక్ కుమార్, తన తరువాతి తరం కేరెక్టర్ యాక్టర్ ప్రాణ్ తో కలసి నటించిన ‘విక్టోరియా నంబర్ 203’ చిత్రం అప్పట్లో జనాన్ని విశేషంగా అలరించింది. ఈ సినిమా తెలుగులో వి.బి.రాజేంద్రప్రసాద్ దర్శకత్వంలో ‘అందరూ దొంగలే’గా రూపొంది, ఇక్కడా అలరించింది. 1972 డిసెంబర్ 8న ‘విక్టోరియా నంబర్ 203’ చిత్రం విడుదలైంది.
‘విక్టోరియా నంబర్ 203’ చిత్ర కథ ఏమిటంటే – సేఠ్ దుర్గాదాస్ పైకి పెద్దమనిషిలా కనిపిస్తూ, లోపల తప్పుడు పనులతో సాగుతుంటాడు. ఓ సారి దుర్గాదాస్ ఓ పథకం వేసి వజ్రాలను దొంగిలించడానికి ఒకడిని నియమిస్తాడు. అతను వజ్రాలు దొంగతనం చేసి మోసగిస్తాడు. వాడిని మట్టుపెట్టమని మరొకడిని పురమాయిస్తాడు దాస్. దుర్గాదాస్ ను మోసం చేసిన వాడు ఓ టాంగా దగ్గర మరణిస్తాడు. ఆ టాంగా పేరు విక్టోరియా. విక్టోరియా టాంగావాలానే హంతకుడని కోర్టు శిక్ష విధిస్తుంది. దాంతో ఆ టాంగావాలా కూతురు, మరో చిన్నపాప అనాథలవుతారు. టాంగా నడపడానికి ఆడపిల్లలకు అప్పట్లో లైసెన్స్ ఇచ్చేవారు కారు. దాంతో టాంగావాలా కూతురు రేఖ మగాడిలా దుస్తులు ధరించి, టాంగా నడుపుతూ ఉంటుంది. టాంగావాల జైలులోనే రాజా, రానా అనే ఇద్దరు మనసున్న దొంగలు ఉంటారు. రాజా తాగుబోతు, అమ్మాయిల పిచ్చి ఉంటుంది. రానా తన కొడుకును ఎవరో కిడ్నాప్ చేశారని, అతడి కోసం అన్వేషిస్తూ ఉంటాడు. వీరిద్దరూ విడుదలై వచ్చాక వజ్రాల చోరీ గురించి తెలుస్తుంది. దుర్గాదాస్ కొడుకు కుమార్ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తుంటాడు. అది దుర్గాదాస్ కు నచ్చదు. టాంగా నడిపే అబ్బాయి – రేఖ అనే ఆడపిల్ల అని కుమార్ కు తెలిసిపోతుంది. రేఖ, కుమార్ ప్రేమలో పడతారు. జైలులో టాంగావాలా ద్వారా విక్టోరియా నంబర్ 203 టాంగాలోనే వజ్రాలు ఉన్నాయని రానా, రాజాకు తెలుస్తుంది. అది రేఖకు చెబుతారు రానా, రాజా. కానీ, టాంగాలో ఎక్కడ ఉన్నాయో తెలుసుకోలేరు. కుమార్ కు తన తండ్రి దుర్గాదాస్ నిజస్వరూపం తెలుస్తుంది. దాంతో ఇల్లు వదలి రేఖ దగ్గరకు వస్తాడు. అతడికీ వజ్రాల గురించి చెబుతారు. టాంగావాలా కూతురే రేఖ అన్న విషయం తెలుసుకున్న దుర్గాదాస్ ఆమెను కిడ్నాప్ చేస్తాడు. ఆమె కోసం రానా, రాజా వెళతారు. అక్కడ కుమార్ దుర్గాదాస్ కొడుకు కాదన్న విషయాన్ని అతని అనుచరుడు చెబుతాడు. ఆ కుమార్ రానా కొడుకు అన్న సత్యం తెలుస్తుంది. చివరకు దుర్గాదాస్ అసలు దోషి అని తేలుతుంది. అతడిని అరెస్ట్ చేసి, టాంగావాలాను విడుదల చేస్తారు. తండ్రిని కలుసుకుంటాడు కుమార్. రేఖ తన తండ్రిని చూసి ఆనందిస్తుంది. అందరూ తమవారిని కలుసుకున్నారు, తానే ఒంటరిని అని భావించిన రాజా వెళ్ళిపోతాడు. అయితే రానా వెళ్ళి అతడిని వెతికి పట్టుకొని వచ్చి కడదాకా తాము కలసే జీవిద్దామని అనడంతో కథ ముగుస్తుంది.
ఇందులో రాజాగా అశోక్ కుమార్, రానాగా ప్రాణ్, కుమార్ గా నవీన్ నిశ్చల్, రేఖగా సైరాబాను, దుర్గాదాస్ గా అన్వర్ హుసేన్ నటించారు. మిగిలిన పాత్రల్లో రంజీత్, మోహన్ చోటీ, అనూప్ కుమార్, చమన్ పురి, ఎమ్.బి.శెట్టి, రాజేశ్ ఖేరా, జగ్దీశ్ రాజ్, జానకీదాస్, హెలెన్, మీనా రాయ్, ప్రతిమా దేవి కనిపించారు. ఈ చిత్రానికి ఎహ్సాన్ రిజ్వీ రచన చేయగా, స్వీయ దర్శకత్వంలో బ్రిజ్ ఈ సినిమా నిర్మించారు. ఇందీవర్ పాటలకు కళ్యాణ్ జీ- ఆనంద్ జీ స్వరకల్పన చేశారు. “దో బేచారే బిన్ సహారే…”, “తు న మిలే తో హమ్ జోగీ బన్ జాయేంగే…”, “దేఖా మైనే దేఖా…”, “తోడాసా ఠహ్రో…” అంటూ సాగే పాటలు అలరించాయి. ఈ సినిమా మంచి విజయం సాధించి, 1972 టాప్ టెన్ హిందీ సినిమాల్లో చోటు సంపాదించింది. తెలుగులో ‘అందరూ దొంగలే’ పేరుతో రీమేక్ అయింది. ‘అందరూ దొంగలే’లో అశోక్ కుమార్ పాత్రను యస్వీ రంగారావు, ప్రాణ్ పాత్రను నాగభూషణం ధరించగా, నవీన్ నిశ్చల్ పాత్రలో శోభన్ బాబు, సైరాబాను ధరించిన రోల్ లో లక్ష్మి కనిపించారు. తెలుగులోనూ ‘అందరూ దొంగలే’ అలరించింది. తమిళంలో ఈ సినిమా జైశంకర్, జయలలిత జోడీగా ‘వైరమ్’ పేరుతో రీమేక్ చేశారు.
‘విక్టోరియా నంబర్ 203’ సినిమా స్ఫూర్తితో కన్నడలో ‘గిడ్డు దాదా’ అనే చిత్రం 1995లో రూపొందింది. 2005లో బెంగాల్ చిత్రం ‘చోరే చోరే మస్తుతో భాయ్’ కూడా ఈ సినిమా ఆధారంగానే తెరకెక్కింది. ‘అందాజ్ ఆప్నాఆప్పా’, మళయాళ చిత్రం ‘సంరంభం’ కూడా ‘విక్టోరియా నంబర్ 203’ స్ఫూర్తితో వెలుగు చూసినవే.