నటసింహం నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తోన్న టాక్ షో ‘అన్ స్టాపబుల్’ మెల్లమెల్లగా జనాల్లో వేడెక్కిస్తోంది. ఈ టాక్ షో ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో సాగడం వల్ల కాబోలు, జనాల్లో విపరీతమైన చర్చ సాగడం లేదు. అదే ఏదైనా టీవీ ఛానెల్ గనుక నిర్వహించి ఉంటే, సామిరంగా తీరేవేరుగా ఉండేదని చూసిన వారు చెబుతున్నారు. ఇప్పటికే ప్రతి ఎపిసోడ్ వైవిధ్యంగా సాగుతోంది. దీని గురించి తెలుసుకున్నవారు అదే పనిగా ‘ఆహా’ ఓటీటీ సబ్ స్క్రైబర్స్ గా మారుతున్నారు. ఈ టాక్ షో మొదలయినపుడు అంతగా ఊపు కనిపించలేదు కానీ, మూడు ఎపిసోడ్స్ అయిన తరువాత నుంచీ మౌత్ టాక్ తో ‘ఆహా’వైపు జనం దృష్టి సారించడం మొదలెట్టారు. అందుకు తగ్గట్టుగానే బాలకృష్ణ తన ఎనర్జీ లెవెల్స్ తో టాక్ షో ను ఓ లెవెల్ కు తీసుకు వెళ్ళారనే చెప్పాలి. ‘అన్ స్టాపబుల్ -6’వ ఎపిసోడ్ లో అంతా బాగుంది కానీ, చివరలో బన్నీ రావడంతో అది ‘పుష్ప’ విజయోత్సవం లాగా మారిందని అన్నారు. ఇదిలా ఉంటే అన్ స్టాపబుల్ ఎపిసోడ్ 7లో మాస్ మహారాజా రవితేజ గెస్ట్ అనగానే జనాల్లో మాత్రం ఊహించని క్రేజ్ ఏర్పడింది.
ప్రతిక్షణం… ఎంజాయ్…
బాలకృష్ణతో రవితేజ కాంబో అనగానే ఈ ఎపిసోడ్ టీజర్ చూసిన దగ్గర నుంచీ పలు చర్చలు మొదలయ్యాయి. అసలు బాలయ్య, రవితేజకు సరిపోదని, వారి ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలనీ జనాల్లో ఆసక్తి పెరిగింది. పైగా బాక్సాఫీస్ బరిలోనూ వీరిద్దరి సినిమాలు కొన్నిసార్లు పోటీపడ్డాయి. ఈ బ్యాక్ డ్రాప్ లో పరిపరి విధాలా పుకార్లు షికారు చేశాయి. ఎట్టకేలకు బాలయ్యతో రవితేజ ఎపిసోడ్ చూడాలన్న అభిలాషతో అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. జనవరి 1న అలాంటి వారికి కనువిందు చేస్తూ ఎపిసోడ్ 7 నిలచింది. బయట జనాల్లో ఉన్న టాక్ ను దృష్టిలో ఉంచుకొనే బాలయ్య, రవితేజను “నీకూ నాకూ పెద్ద గొడవైందటగా…” అంటూనే ప్రశ్నించారు. అందుకు రవితేజ తనదైన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చారు. ఇద్దరూ తమకు కోపం వచ్చినప్పుడు ‘బండ’ బూతులు వస్తాయని చెప్పుకోవడం సరదాగా అనిపించింది. ఓ ప్రశ్నకు సమాధానంగా “నేను పాట్లు పడే రోజుల్లోని ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేశాను” అని రవితేజ చెప్పారు.
బ్యాంక్ వద్దు… బ్యాంకాక్ కావాలి…
బాలయ్య, రవితేజ ఇద్దరూ తమ పోలీస్ కేరెక్టర్స్ గురించి చర్చించుకోవడం ముచ్చట గొలిపింది. పోలీస్ గెటప్స్ వేసిన ఏ సినిమాలూ ఫ్లాప్ కాలేదనీ చెప్పుకున్నారు. బాలయ్య తనను ‘రౌడీ ఇన్ స్పెక్టర్’ అనుకుంటే, రవితేజ ‘విక్రమార్కుడు’ను గుర్తు చేసుకున్నారు. నీ కెరీర్ లో 2002 మరచిపోలేనిదని బాలయ్య గుర్తు చేయగా, అందుకు కారణంగా – కొత్త కొత్తవారితో పనిచేయడం నాకు ఇష్టం, వాళ్ళు నాకంటూ ఓ ఇమేజ్ ఇచ్చే పాత్రలు సృష్టించారని చెప్పారు రవితేజ. “మంచి టాలెంట్ ను ఇచ్చావమ్మా ఇండస్ట్రీకి…” అంటూ బాలయ్య, రవితేజను అభినందించడం ఆకట్టుకుంది. ఇద్దరూ వయసులో అమ్మాయిల వెంట పడ్డ సంఘటనలు గుర్తు చేసుకున్నారు. ఆ సందర్భంలోనే, మాటల్లో బాలయ్య “నాకు బ్యాంక్ వద్దు… బ్యాంకాక్ కావాలంటే… తప్పదు మరి…” అనగానే, రవితేజ పగలబడి నవ్వారు. ఆయనతో పాటు అక్కడున్న జనం శ్రుతి కలిపారు.
డి.యన్.కె. అంటే…
ఓ ప్రశ్నకు సమాధానం చెబుతూ, అందులో తన తనయుణ్ణి ‘డి.యన్.కె.’ అని పిలుచుకుంటానని చెప్పారు రవితేజ. డి.యన్.కె. అబ్రివేషన్ కు ఫుల్ ఫామ్ రవితేజ నోట విని జనం కేరింతలు కొట్టారు. మధ్యలో రవితేజ తనయుడు, కూతురు కూడా వీడియోస్ ద్వారా ప్రోగ్రామ్ లో పాల్గొనడం, రవితేజ కూతురు చివరలో ‘జై బాలయ్యా…’ అనడం ఆకట్టుకుంది. తరువాత పలు సందర్భాల్లో రవితేజ ఫోటోలు ప్లే చేస్తూ… వాటిపై కామెంట్స్ సాగాయి. “నీకున్న క్లారిటీకి అమ్మా… మంచి డైరెక్టర్ అవుతావు…” అంటూ బాలయ్య, రవితేజకు కాంప్లిమెంట్ ఇవ్వడమూ అలరించింది. కావాలంటే నీ డైరెక్షన్ లో నేను చేస్తా అన్నారు బాలయ్య, అప్పుడేమొస్తుంది “మాస్ అమ్మ మొగుడు” వస్తుందనీ ఆయనే చెప్పడంతో మరింత వినోదం పండింది. తనకు ఐదు కుక్కలు ఉన్నాయని, వాటిపేర్లు చెబుతూ ‘బ్రాందీ, విస్కీ…’ అని తెలిపారు రవితేజ. అప్పుడు బాలయ్య, “మ్యాన్షన్ హౌస్…లేదా…” అనగానే, “అది మీ బ్రాండ్ కదా…” అని రవితేజ నవ్వులు పూయించారు.
ధోనీ స్ఫూర్తి!
గేమ్ మధ్యలో ‘క్రాక్’ డైరెక్టర్, ప్రస్తుతం బాలకృష్ణతో సినిమా తీస్తోన్న మలినేని గోపీచంద్ కూడా పాల్గొన్నారు. మాటల మధ్యలో తనకు బోయపాటి శ్రీనులాగా, రవితేజకు గోపీచంద్ అని చెప్పారు బాలయ్య. అలాగే “నీ అన్ని సినిమాలు చూస్తానమ్మా…” అంటూ రవితేజకు తెలిపారు బాలకృష్ణ. దాంతో ‘థ్యాంక్యూ…’ అంటూ రవితేజ పొంగిపోయారు. ఓ ప్రశ్నకు సమాధానంగా గోపీచంద్, “నేను పైకి కామ్ గా ఉన్నా, లోపల ఫైర్ ఉంటుంది…” అన్నారు. అందుకు బాలయ్య, “సమరసింహారెడ్డి ఫస్ట్ ఆఫ్ లాగా ఉంటావ్…” అనేశారు. తరువాత తాను ‘సమరసింహారెడ్డి’ సినిమా కోసం అరెస్ట్ అయిన వైనాన్ని వివరించారు గోపీచంద్. రవితేజలో నీకు నచ్చని పాయింట్ ఏంటి అంటూ గోపీచంద్ ను అడిగారు బాలకృష్ణ. అందుకు సమాధానంగా- “అన్నీ పద్ధతిగా ఉండాలని అనుకుంటారు – అదే నచ్చని అంశం” అని గోపీచంద్ చెప్పారు. రేపు నాతో కూడా అదే ప్రాబ్లమ్ వస్తుంది నీకు అని బాలయ్య చెప్పడం ఆకట్టుకుంది. తాను ఎప్పుడూ కామ్ గా ఉండడానికి, మాజీ క్రికెట్ కెప్టెన్ ధోనీ స్ఫూర్తి అని చెప్పారు గోపీచంద్.
హీరో హీరో నడుమ డైరెక్టర్!
రవితేజపై వచ్చిన డ్రగ్స్ అభియోగాన్ని కూడా ఇందులో చర్చించారు. ‘ఒకటే జీవితం… దానిని వేస్ట్ చేసుకోవద్దు…’ అంటూ ఓ ప్రశ్నకు రవితేజ సమాధానమిచ్చారు. బాక్సింగ్ లో వరల్డ్ ఛాంపియన్ గా నిలచిన మెహబూబ్ ఖాన్ ను ఈ ఎపిసోడ్ లో పదిమందికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తిగా పరిచయం చేశారు. ‘నీవు ఎంత గొప్పోడివి కావాలంటే, నీ కథతో ఓ బయోపిక్ తీయాలయ్యా…’ అంటూ బాలకృష్ణ అతణ్ణి ప్రోత్సహించారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా నీకు స్పాన్సరర్స్ దొరుకుతారు అని బాలయ్య భరోసా ఇచ్చారు. తరువాత ‘టగ్ ఆఫ్ వార్’ లాగా తాడు పట్టుకొని బాలయ్య ఓవైపు, రవితేజ మరో వైపు మధ్యలో వారిద్దరికీ డైరెక్షన్ చేస్తూ గోపీచంద్ చేసిన హంగామా భలే వినోదం పంచింది. చివరగా ‘అఖండ’లోని “జై బాలయ్యా…” పాటకు రవితేజ, బాలయ్యలాగా డాన్స్ చేసి అలరించారు. ‘క్రాక్’లోని “మాస్ బిర్యానీ…” పాటకు బాలకృష్ణ స్టెప్స్ వేసి మురిపించారు. దాదాపు ఈ సందడి 45 నిమిషాల పాటు సాగింది. బాలకృష్ణ, రవితేజ మధ్య ఏదో ఉందని భావించేవారికి, ఈ ఎపిసోడ్ ఓ ఆన్సర్ గా నిలచింది. సినిమా రంగంలోని బంధాలు, అనుబంధాలు ఎలా ఉంటాయో తెలియచెప్పింది.