ఇప్పటి దాకా ప్రసారమైన ‘అన్ స్టాపబుల్ -యన్.బి.కె.’ ఎపిసోడ్స్ అన్నిటికంటే నిడివి గలది ఎసిపోడ్ 9. నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తోన్న ‘అన్ స్టాపబుల్ యన్.బి.కె’ టాక్ షో ప్రతి ఎపిసోడ్ లోనూ సినిమా పర్సనాలిటీస్ తోనూ, జీవితంలో పట్టుదలతో పైకి వచ్చిన వారి స్ఫూర్తి నింపుతూ సాగుతోంది. ఈ ఎపిసోడ్ 9లో పూరి జగన్నాథ్ తాజా చిత్రం ‘లైగర్’ టీమ్ సందడి చేయడం విశేషం! ఈ ఎపిసోడ్ సంక్రాంతికి ప్రసారమైంది. బాలయ్య కూడా వరైటీగా ఈ సారి అడ్డ పంచె కట్టి కనిపించడం విశేషం!
పూరి జగన్నాథ్ సమయానికి రాకపోయేసరికి, బాలకృష్ణనే తానే ప్రశ్నలు అడుగుతూ, తానే జగన్ లాగా సమాధానాలు చెబుతూ అలరించారు. తరువాత జగన్ ఎంట్రీ ఇచ్చారు. బాలయ్యను పూరి ‘బాలా’ అంటూ అభిమానంగా పిలవడం విశేషం! ‘పైసా వసూల్’ సమయంలో ఫస్ట్ డే కాసింత టెన్షన్ ఉండిందని, తరువాతి రోజు నుంచీ అసలు టెన్షన్ అన్నదే లేదని పూరి జగన్నాథ్ తొలి ప్రశ్నకు సమాధానమిచ్చారు. ‘అన్నిటి కంటే కష్టం – బ్యాంకాక్ లో స్క్రిప్ట్ రాయడం’ అని పూరి చెప్పారు. మధు ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ లో డైరెక్షన్ లో కోచింగ్ కు చేరి, ఎవరూ లేకపోవడంతో యాక్టింగ్ క్లాసెస్ లో కూర్చుని, నెల రోజులకే వెళ్ళి పోయానని పూరి తెలిపారు. హైదరాబాద్ లోని జిమ్స్ అన్నీ నీకు థ్యాంక్స్ చెప్పాలయ్యా, నీ సినిమాలలో సిక్స్ ప్యాక్ చూసి ఎంతోమంది జిమ్స్ కు వెళ్ళారని బాలకృష్ణ గుర్తు చేశారు. ఇష్టమైన పనిచేయడం, రోజుకో గంట ఎక్సర్ సైజ్ చేయడంతో ఎవరికైనా మనశ్శాంతి ఉంటుందని పూరి అన్నారు. బాలకృష్ణ చెప్పిన ‘సారా దండకం’ కూడా భలేగా ఆకట్టుకుంది.
బాలయ్యతో పూరి తెరకెక్కించిన ‘పైసా వసూల్’లోని “మామా ఏక్ పెగ్ లా…” పాట విశేషాదరణ చూరగొంది. దాని బ్యాక్ డ్రాప్ ఓ సరదా గేమ్ ప్లాన్ చేశారు. ఎదురుగా కొన్ని గ్లాసెస్ లో పలు రకాల జ్యూస్ లు పెట్టారు. సమాధనం చెప్పగలిగితే చెప్పడం, లేదంటే ‘ఓ పెగ్’ లాగించేయడం ఆ ఆటలోని నియమం! తొలి ప్రశ్నగా “పైసా వసూల్ టైమ్ లో పోర్చుగల్ లో నా గర్ల్ ఫ్రెండ్ పేరేంటి?” అని బాలయ్య అడిగారు. ఓ ప్రశ్నకు సమాధానంగా “గుండెల మీద చేయేసుకొని చెబుతున్నా, నేను మనస్ఫూర్తిగా ప్రేమించిన హీరో బాలయ్య” అన్నారు పూరి. అలాగే “రాముడు… భీముడు… బాలయ్యబాబు దేవుడు…” అంటూ జగన్ చెప్పడం అందరినీ అలరించింది. ఛార్మివల్లే తాను మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ చేశానని పూరి తెలిపారు.
ఇరవై నిమిషాలు దాటిన తరువాత పూరి పార్ట్ నర్ ఛార్మి కూడా ఈ టాక్ షో లో పాల్గొన్నారు. బాలయ్యతో ఛార్మి ‘అల్లరి పిడుగు’లో నటించారు. “యాక్టర్ గాచూశాను, ఇప్పుడేమో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా చూస్తున్నానని” ఛార్మికి కితాబు నిచ్చారు బాలయ్య. ఛార్మి కూడా బాలకృష్ణను ‘బాల’ అని పిలవడం గమనార్హం! పదిహేనేళ్ళు నటిగా సాగిన తరువాత ప్రొడక్షన్ వైపు ఎలా వచ్చిందో వివరించారు ఛార్మి. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో తమకు కలిగిన అనుభవాన్ని కూడా ఛార్మి తెలిపారు.
అరగంట టాక్ షో నడచిన తరువాత పూరి తాజా చిత్రం ‘లైగర్’ హీరో విజయ్ దేవరకొండ కూడా ఎంట్రి ఇచ్చారు. ‘సమరసింహారెడ్డి’ వెల్ కమ్స్ ‘అర్జున్ రెడ్డి’ అని బాలయ్య అనగానే ఆ ప్రాంగణం కేకలతో మారుమోగి పోయింది. సరైన సమయంలో తనకు ‘లైగర్’ లాంటి యాక్షన్ సినిమా పడిందని విజయ్ తెలిపారు. బాలయ్య చదువుకొనే రోజుల్లో తన బాక్సింగ్ గురించి చెప్పి ఆకట్టుకున్నారు. తాను ‘రౌడీ’ అన్న బ్రాండ్ పెట్టడానికి కారణం ఏంటో వివరించారు విజయ్. పూరి జగన్నాథ్ లో నచ్చే గుణం, ఎప్పుడు స్క్రిప్ట్ గురించి, సినిమా గురించి ఓ చిన్నపిల్లాడిలా ఆలోచిస్తూ ఉంటాడని విజయ్ చెప్పారు.
తాను డబ్బుకు ఎప్పుడూ వేల్యూ ఇవ్వలేదని పూరి జగన్నాథ్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అనుభవం నేర్పిన పాఠం ఏమిటంటే ‘మనీకి ఖచ్చితంగా వేల్యూ ఇవ్వాలి’ అని ఆయన తెలిపారు. ఇదే సందర్భంగా వందేళ్లు పూర్తి చేసుకున్న ‘సురభి నాటక సమాజం’ వారిని వేదికపైకి ఆహ్వానించారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా, ఈ నాటికీ ‘సురభి’ బ్రాండ్ ను కొనసాగిస్తున్నారు ఆ నాటక సమాజానికి చెందిన వారసులు. వారికి ఆర్థికంగా అండగా ఉంటామని, వారి నాటకాల్లో పాత్రలు వేయమన్నా వేస్తామని బాలకృష్ణ హామీ ఇచ్చారు. సురభివారి తొమ్మిదొ తరానికి చెందిన ఓ చిన్నారికి బాలకృష్ణ కుంకుమ దిద్దారు. ఆ పాప పేరు ‘తారక రామారావు’ అని కన్నవారు తెలిపారు. ఇక ఓ ఏవీ చూపించి, అందులోని బాలనటుణ్ణి మీ సినిమాలో పెట్టుకోవాలని కోరారు బాలయ్య. ఆ బాలనటుణ్ణి చూడగానే విజయ్ వెల్లకిలా పడ్డారు. అది తాను పుట్టపర్తిలో చదువుతూ ఉండగా, నటించిన ‘షిర్డిసాయి- పర్తిసాయి’ టీవీ సీరియల్ లోనిదని వివరించారు విజయ్.
బాక్సింగ్ నేపథ్యంలోనే పూరి, విజయ్ , ఛార్మి కలయికలో ‘లైగర్’ తెరకెక్కింది. అందువల్ల ఓ పంచ్ బ్యాగ్ పెట్టి దానిని ఓ మార్కు దాటే దాకా కొడితే సులభమైన ప్రశ్న వేస్తానని, ముందే ఆగితే కష్టమైన క్వశ్చన్ ఉంటుందని తెలిపారు బాలయ్య. విజయ్ ని “బాలకృష్ణ ఫస్ట్ పిక్చరేది?” అని అడగ్గా, అతను సమాధానం చెప్పలేకపోయారు. దాంతో ఆడియెన్స్ నుండి ‘తాతమ్మకల’ అంటూ కేకలు వినిపించాయి. తరువాత పూరి జగన్నాథ్ ను “మైక్ టైసన్ బర్త్ డే ఎప్పుడు?” అని అడిగారు. అందుకు ఛార్మి ఇయర్ 1966 అని తెలుసు కానీ, డేట్ అంటూండగానే బాలయ్య అందుకొని “జూన్ 30” అని చెప్పారు. ఛార్మిని ఆమె ఫస్ట్ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో అడిగారు. అందుకు ఆమె సమాధానం చెప్పలేక పోయింది. చివరగా విజయ్ ని అడిగిన ప్రశ్నకు “ఆగస్టు 25 – లైగర్ రిలీజ్ డేట్” అని చెప్పారు. ‘లైగర్’ ట్రైలర్ ప్రదర్శించారు. ఈ సినిమా నేషనల్ లెవెల్ సినిమా కాదు, ఇంటర్నేషనల్ లెవెల్ సినిమా కావాలని బాలయ్య అభిలషించారు.