నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ .. ఎపిసోడ్ ఎపిసోడ్ కి ఆసక్తికరంగా మారుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో బాలయ్య సందడి చేస్తున్న తీరు ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తోంది. ఇప్పటికే 5 ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకున్న ఈ టాక్ షో 6 వ ఎపిసోడ్ కి సిద్దమవుతుంది . 6 వ ఎపిసోడ్ లో పుష్పరాజ్ అల్లు అర్జున్ బాలయ్య తో సందడి చేయనున్నాడు. క్రిస్టమస్ కానుకగా ఈ ఎపిసోడ్ డిసెంబర్ 25 న విడుదల కానుంది. ఇక ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాకముందే మరో సర్ ప్రైజ్ ని ఇచ్చారు ఆహా వారు. ఎపిసోడ్ 7 ప్రోమోను రిలీజ్ చేసిన అందరిచేత ఆహా అనిపించారు. ఈ ఎపిసోడ్ లో మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని రచ్చ చేశారు. తాజా ప్రోమోలో మాస్ మహారాజా , బాలయ్యల ఎనర్జీ అదరగొట్టేసింది.
రావడం రావడమే మన ఇద్దరి మధ్య గొడవ ఉందంటగా .. ఏంటి అది అని బాలయ్య అడగడం .. దానికి సమాధానంగా రవితేజ తనదైన రీతిలో పనీపాటాలేని డాష్ గాళ్ళకు ఇదే పని అంటూ నవ్వులు చిందించారు. దీంతో వీరి మధ్య ఉన్న గొడవ నిజం కాదని, పుకార్లు మాత్రమే అని తేల్చేశారు. ఇక ప్రోమోలో బాలయ్య అల్టిమేట్ ప్రశ్నలు.. రవితేజ ఊర మాస్ సమాధానాలతో ఆద్యంతం ఆకట్టుకొంటోంది. బాలయ్య, రవితేజను బూతులు మాట్లాడమనడం .. ఆయన నేను బూతులు మాట్లాడితే చస్తారు కానీ అనడం , కాలేజీలో అమ్మాయిలకు సైట్ కొట్టేవాడివి అంటగా అని బాలయ్య అడగడం .. ఇవన్నీ ఎవరు చెప్పారని రవితేజ సిగ్గు పడడం .. దీంతో బాలయ్య తన కాలేజీస్టోరీలు చెప్పడం.. ఇక మధ్యలో దర్శకుడు గోపీచంద్ మలినేనిని బాలయ్య , రవితేజ ఆడుకోవడం చూపించారు. సమరసింహా రెడ్డి కోసం జైల్లో ఉన్నా అన్న విషయం చెప్పిన గోపీచంద్.. రెండు పడ్డాయా అని బాలయ్య అంటే.. ఒకటి శాంపిల్ వేశారు అని గోపీచంద చెప్పడంతో మరోసారి నవ్వులు పూశాయి.
ఇక రవితేజ కెరీర్ లో మాయని మచ్చగా ఉన్న డ్రగ్స్ కేసును బాలయ్య బయటికి తీశాడు. ఇక ఈ విషయమై రవితేజ కొద్దిగా బాధ పడినట్లు చూపించారు. మొత్తని ఈ ఎపిసోడ్ అన్ స్టాపబుల్ లోనే హైలెట్ గా నిలిచేలా ఉందని నెటిజన్స్ అంటున్నారు. ఇక ఎపిసోడ్ డిసెంబర్ 31 న స్ట్రీమింగ్ కానుంది. మరి బాలయ్య- రవితేజ మాస్ అల్లరి చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.