ఎన్నికల సమయంలో సినిమా వాళ్ళ పబ్లిసిటీని రాజకీయ నేతలు కోరుకుంటున్నట్టే… ఇప్పుడు సినిమా వాళ్ళు రాజకీయ నేతలు తమ చిత్రం గురించి నాలుగు మంచి మాటలు చెబితే బాగుండని ఆశపడుతున్నారు. ఆ మధ్య వచ్చిన ‘ద కశ్మీర్ ఫైల్స్’ మూవీకి బీజేపీ నేతలు బాగానే పబ్లిసిటీ చేశారు. అలానే ఇటీవల కాన్స్ లో ప్రదర్శితమైన మాధవన్ ‘రాకెట్రీ’ మూవీ టీజర్, ట్రైలర్ తో పాటు సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను చూసిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ చిత్ర బృందాన్ని అభినందించడంతో పాటు ఈ తరహా సినిమాలను ప్రోత్సహించాలని అన్నారు. ఇక ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గతంలోనూ, ఇప్పుడూ కూడా అవకాశం చిక్కితే తెలుగు సినిమా చూసి తన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకుంటూనే ఉన్నారు. తాజాగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సైతం జూన్ 3న విడుదల కాబోతున్న ‘పృథ్వీరాజ్’ మూవీని రెండు రోజుల ముందే అంటే జూన్ 1వ తేదీన వీక్షించబోతున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు చంద్రప్రకాశ్ ద్వివేది కూడా నిర్ధారించారు. ‘భరతమాత ముద్దుబిడ్డ, సమ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ ఈ దేశం కోసం తన ప్రాణాలను ధారపోశారు. అటువంటి గొప్ప వ్యక్తి కి సంబంధించిన చరిత్రను తెరపై చూపుతున్నాం. ఈ మూవీని కేంద్ర హోం శాఖామంత్రి చూడబోతున్నది వాస్తవం” అని అన్నారు. అక్షయ్ కుమార్ టైటిల్ రోల్ పోషించిన ‘పృధ్వీరాజ్’లో సంజయ్ దత్, సోనూసూద్, మానుషి చిల్లర్, అశుతోష్ రాణా, సాక్షి తన్వర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.