మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కాబోతున్నాయి. అందులో ఒకటి సత్యదేవ్ తో కలిసి తమన్నా నటించిన ‘గుర్తుందా శీతాకాలం’. గత కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించుకుంది. సెప్టెంబర్ 23న ఆ మూవీని విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. ఈ సినిమా గురించి దర్శకుడు నాగశేఖర్ మాట్లాడుతూ, ”ప్రతీ ఒక్కరు తమ జీవితంలో సెటిల్ అయిన తర్వాత కొన్ని విషయాల్ని ఎప్పటికీ మరిచిపోరు. ముఖ్యంగా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వచ్చే యూత్ లైఫ్లో జరిగే సంఘటనలు జీవితాంతం గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఇలాంటి ఆహ్లాదకరమైన సంఘటనలు ప్రేక్షకులకి గుర్తు చేసే ఉద్దేశంతో ఈ సినిమాను తీశాం” అని అన్నారు. దీనిని భావన రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్ ఎస్ రెడ్డి, చినబాబు సంయుక్తంగా నిర్మించారు. కన్నడలో విడుదలైన చక్కని విజయాన్ని అందుకున్న ‘లవ్ మాక్ టైల్’కు ఇది రీమేక్. ఇప్పటికే విడుదలైన టైటిల్ సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని, అందులో సత్యదేవ్, తమన్నా కెమిస్ట్రీ ఈ పాటకు హైలైట్ గా నిలిచిందని నిర్మాతలు తెలిపారు.

ఇదిలా ఉంటే… తమన్నా నటించిన ‘బబ్లీ బౌనర్స్’ మూవీ కూడా సెప్టెంబర్ 23వ తేదీనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. దీనిని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్ డైరెక్ట్ చేశాడు. అలానే… ఆ తర్వాత వారమే తమన్నా నటించిన మరో సినిమా ‘ప్లాన్ ఏ ప్లాన్ బి’ కూడా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. మొత్తం మీద వారం రోజుల వ్యవథిలో తమన్నా నటించిన రెండు హిందీ, ఒక తెలుగు సినిమా విడుదల కాబోతున్నాయి.