Tom Hanks: వరుసగా రెండు సంవత్సరాలు 1993లో ‘ఫిలడెల్ఫియా’, 1994లో ‘ఫారెస్ట్ గంప్’ చిత్రాలతో ఉత్తమ నటునిగా ఆస్కార్ అవార్డులు అందుకొని అందరినీ ఆకర్షించిన టామ్ హ్యాంక్స్ రచయితగా మారిన సంగతి తెలిసిందే! మూడు పదుల కెరీర్ లో పలు ఉత్తమ చిత్రాలలో తనదైన అభినయం ప్రదర్శించిన టామ్ తొలిసారి రచయితగా తన కలం బలం ప్రదర్శిస్తూ ‘ద మేకింగ్ ఆఫ్ అనదర్ మేజర్ మోషన్ పిక్చర్ మాస్టర్ పీస్’ అనే నవలను రూపొందించారు. ఈ నవల మే 9న జనం ముందు నిలచింది. రాగానే విమర్శకులు ఒక్కసారిగా దీనిపై తమ కలం బలం చూపిస్తూ రివ్యూలు రాశారు. ఎన్నో పాత్రలకు జీవం పోసిన టామ్ హ్యాంక్స్ ఈ నవలలో జీవాన్ని నింపలేక పోయారన్నది అధిక సంఖ్యాకుల అభిప్రాయం!
నటునిగా తాను ఎంతో బిజీగా ఉంటూ, తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని అధ్యయనం చేసి ఈ రచన చేశానని, అందువల్ల తన పరిజ్ఞానం పరిమితమైందే కానీ, విస్తృతమైనది కాదని టామ్ అంగీకరిస్తున్నారు. ఓ వైపు నటనలో సాగుతూనే తీరిక వేళల్లో ఈ నవలా రచన చేసినట్టు టామ్ చెబుతున్నారు. కొన్నిసార్లు షాట్ గ్యాప్స్ లోనూ, మరికొన్నిసార్లు ఫ్లైట్ లో ప్రయాణిస్తున్నప్పుడు రాస్తూ ఈ నవల పూర్తి చేశానని వివరించారు. టామ్ నటునిగా ఎంతో గొప్పవాడు కావచ్చు కానీ, రచయితగా అతనికి ఓనమాలు కూడా రావని తేలిపోయిందంటూ ఓ విమర్శకుడు అభిప్రాయపడ్డారు. దాదాపుగా ‘ద మేకింగ్ ఆఫ్ అనదర్ మేజర్ మోషన్ పిక్చర్ మాస్టర్ పీస్’ నవలపై సమీక్షలన్నీ టామ్ రచనను ఏకిపారేశాయి. ఇంతకూ ఓ కొత్త రచయితపై ఇంతగా విమర్శలు గుప్పించడానికి ఆయన స్టార్ కావడం కారణమనుకుంటే పొరబాటే! అసలు కారణమేంటి అంటే అందులో ఓ చోట ‘జర్నలిస్టులు సోమరులు’ అనే మాట ఉందట! మరి క్రిటిక్స్ ఊరకుంటారా చెప్పండి!?